వైసీపీ ఎమ్మెల్యేలు తమ భాషను అధికారిక భాషగా ప్రకటించుకుంటున్నారు. మీడియా ముందు అత్యంత దారుణంగా మాట్లాడుతూ.. మేమింతే మాట్లాడతామని ఎదురు దబాయించడం ఇప్పటి వరకూ చూశాం. ఇప్పుడు తమ తిట్ల వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. అవి అసలు తిట్లే కాదని.. గ్రామాల్లో అంతే మాట్లాడుకుంటారని తేలిగ్గా చెప్పేస్తున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. వెంగయ్య అనే జనసేన కార్యకర్తను తిట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఆయన అనుచరులు… వెంగయ్యను బెదిరించడంతో ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఏపీ వ్యాప్తంగా సంచలనం అయింది. అన్నా రాంబాబు తిట్లు.. ఆ తర్వాత పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
పవన్ కల్యాణ్ ఒంగోలు వెళ్లి అన్నా రాంబాబును హెచ్చరించి… ఆయనపై చర్యలు తీసుకోవాలని జగన్ను డిమాండ్ చేశారు. ఈ తరుణంలో వైసీపీ హైకమాండ్ ఆయనతో ప్రెస్మీట్ పెట్టించింది. తను వెంగయ్యను తిట్టలేదని.. పక్కన ఉన్న చందు అనే మరో వ్యక్తిని తిట్టానని.. కానీ సోషల్ మీడియాలో గ్రాఫిక్స్ తో మార్చారని చెప్పుకొచ్చారు. ఈ సమర్థింపు చాలా మందిని ఆశ్చర్య పరచలేదు కానీ.. లాంగ్వేజ్ విషయంలో ఆయన సమర్థన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. అలాంటి బూతు భాషనే మళ్లీ మీడియా ముందు ప్రయోగించి.. అదంతా సహజంగా గ్రామాల్లో మాట్లాడుకునే భాషే అన్నారు.
లైవ్లో ఆయన మాటలు వింటున్న వారికి దీంతో ఒళ్లు జలదరించినట్లయింది. అందరూ మాట్లాడుకునేవే అని.. అందరి ముందూ మాట్లాడటం.. అందరూ చేసుకునేవే అని కొన్ని చేయకూడని పనులను బహిరంగంగా చేస్తారా అన్న సెటైర్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి. తప్పు చేసి.. సమర్థించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేసే… వైసీపీ ఎమ్మెల్యేలను చూసి.. జాలిపడాలో.. అసహ్యించుకోవాలో తెలియక నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు.