మదనపల్లి శివారులోని టీచర్స్ కాలనీ అత్యంత విలాసంగా కనిపిస్తున్న భవనంలో జంట హత్యలు జరిగాయి. ఎదిగి వచ్చిన ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులు చంపేశారు. పూజ గదిలో ఒకరిని శూలంతో పొడిచి చంపేశారు. మరొకరిని రాగి చెంబు నోట్లో పెట్టి డంబెల్‌తో కొట్టి చంపేశారు. చనిపోయిన ఇద్దరూ చిన్న వాళ్లేం కాదు 22 ఏళ్లు..27 ఏళ్లు. వారిని చంపిన తల్లిదండ్రులూ నిరక్ష్య రాస్యులు కాదు. బాగా చదువుకున్న వారే. ఆ చదువును.. విజ్ఞానాన్ని ఎంతో మందికి పంచుతున్న ఉపాధ్యాయులే. అయినా కూతుళ్లను చంపేశారు. దీనికి కారణం కుటంబససమస్యలో.. మరొకటో అయితే పాపం అనుకునేవారు కానీ… మూఢ నమ్మకాలతో… తమ బిడ్డలు మళ్లీ బతుకుతారన్న నమ్మకంతో చంపేశారు.. ! ఈ కారణం తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రుల వైపు ఎలా చూడాలో.. పోలీసులకు జనాలకు అర్థం కావడం లేదు.
పురుషోత్తంనాయుడు, పద్మజ అనే దంపతులు ఉపాధ్యాయులు. పురుషోత్తం మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్. పద్మజ ప్రైవేటు కాలేజీ కరస్పాండెంట్. వీరు కొత్తగా ఓ ఇల్లు నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో దివ్య శక్తులు ఉన్నాయని పూజలు చేయడం ప్రారంభించారు. బయటకు వీరు సాధారణంగానే ఉంటూ ఉంటారు. దీంతో పూజల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు. తర్వాత ఏం చేయాలో తెలియక.. .పురుషోత్తం నాయుడు తన స్నేహితులకు సమాచారం అందించారు. షాక్‌కు గురైన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు పురుషోత్తం నాయుడు, పద్మజలను అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ కుమార్తెలు చనిపోలేదని.. తమ ఇంట్లో అదృశ్య శక్తులు ఉన్నాయని.. వారు రేపు లేచి వస్తారని చెబుతున్నారు. వీరి మాటలు విని పోలీసులు కూడా ఆశ్చర్య పోతున్నారు. వారిని ఎలా ట్రీట్ చేయాలో తెలియక సతమతమవుతున్నారు. తాము కూడా బతికి వస్తామని ఆత్మహత్యచేసుకుంటారేమోనని పోలీసులు వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
బాగా చదువుకుని విద్యాబుద్దులు నేర్పుతున్న ఆ ఇద్దరు ఇలా పూజలు.. మూఢనమ్మకాల మత్తులోకి వెళ్లడానికి ఓ దొంగ స్వామిజీ కారణంగా అనుమానిస్తున్నారు. మదనపల్లెకు చెందిన ఓ స్వామిజీ పట్టుకున్న పోలీసులు మిగతా వివరాలు రాబడుతున్నారు. ఆ ఇల్లు కట్టినప్పడి నుంచి పూజల రూపంలో ఆ ఉపాధ్యయ దంపతుల్ని మూఢ నమ్మకాలకు గురి చేసి.. వారిలో ఓ రకమైన హింసాత్మక భావనను పెంచారని… చివరికి కన్నబిడ్డలను చంపుకునేలా చేయడంలో ఆ స్వామిజీ పాత్ర ఉందని నమ్ముతున్నారు. నలుగురికి చెప్పాల్సిన వారే అంత దారుణమైన మూఢనమ్మకాలను నమ్మి.. కన్న బిడ్డలను చంపుకునే పరిస్థితి రావడం చాలా మందిని కలచి వేస్తోంది.