కేసీఆర్ చాలా కాలంగా ఉన్న సమస్యలకు తక్షణం పరిష్కారం చూపించాలన్న హడావుడిలో ఉన్నారు. ఆదివారాలు కూడా ఆయన సమీక్షలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉద్యోగుల పీఆర్సీ, ప్రమోషన్లపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత ఆ ప్రకటనలు చేసి సైలెంటయిపోయారు. ఉద్యోగుల్లో అసంతృప్తి కనిపిస్తూండటంతో… ఇప్పుడు డేట్ లైన్ పెట్టారు. పది రోజుల్లో చర్చలు పూర్తి చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. అలాగే పంటల కొనుగోళ్లపై రైతుల్లో పెరిగిపోతున్న ఆందోళనను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ పరంగా ఇక పంటల కొనుగోలు ఉండదన్నసంకేతాలు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు… వెనక్కి తగ్గారు. గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇక అవసరం లేదని ప్రకటించారు. అయితే ఇప్పుడు… కొత్త వ్యవసాయ చట్టాలను అమలు చేసినా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెబుతారు. మార్కెట్ యార్డులు.. ప్రభుత్వం పంట కొనుగోలు వ్యవహారాలు ఉంటాయని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సమీక్ష చేసి.. రైతులకు కాస్తంత సానుకూలమైన సందేశాన్ని పంపించారు.
కేంద్ర వ్యవసాయ చట్టాలకు పరోక్షంగా మద్దతు ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. పంట కొనుగోలు కేంద్రాలు ఇక అవసరం లేదని ప్రకటించారు. దీంతో రైతుల్లో అలజడి ప్రారంభమయింది. దీన్ని విపక్ష నేతలు అవకాశంగా మల్చుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు… సీఎం కేసీఆర్ తమను ఈ రకంగా టార్గెట్ చేస్తున్నారని.. పంటలను ప్రభుత్వం కొనకుండా… బీజేపీ తెచ్చిన చట్టం వల్లనే కొనడం లేదనిప్రచారం చేసి..బీజేపీపై రైతుల్లో వ్యతిరేకత పెంచుతారని అనుమానిస్తున్నారు. దీంతో పంటలను కొనాల్సిందేనని వారుతీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా… ఆందోళనలకు సిద్ధమయింది. ఈ క్రమంలో కేసీఆర్ పంటల కొనుగోలుపై రైతులకు ఊరట ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇటీవలి కాలంలో కేసీఆర్ వీలైనంత వరకూ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఓ వైపు నాయకత్వ మార్పు ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో… కేసీఆర్ మాత్రం… సమస్యల పరిష్కార అంశంలోబిజీగా ఉన్నారు.