పంచాయతీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించకూడదనుకుంటున్న అధికార పార్టీ పెద్దలు.. రకరకాల వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చినా మళ్లీ హైకోర్టు ముందు కొత్త రకం పిటిషన్‌ను తీసుకొస్తున్నారు. గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల అనే యువతి ఎన్నికలను నిలిపివేయాలని పిటిషన్ వేశారు. ఎందుకంటే.. ఆమె ఓటు హక్కును కోల్పోయిందట. తనకు ఓటేసే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని.. కానీ ఎస్ఈసీ కల్పించలేదని అందుకే.. ఎన్నికలను ఆపేయాలని ఆమె ఆదివారం హైకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అయితే… రెగ్యులర్ కోర్టులోనే విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది
ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో 2021 ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోకుండా 2019 ఓటర్ల జాబితాను ఉపయోగించాల్సిందిగా కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. 2021 ఓటర్ల జాబితాను సిద్దం చేయడంలో రాష్ట్ర పంచాయితీ శాఖ అధికారులు ఆశించిన స్థాయిలో పనిచేయలేదని.. అందువలనే గత్యంతరం లేక 2019 ఓటర్ల జాబిఇతాను పరిగణలోకి తీసుకున్నామని రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ప్రకటించార.ు దీనివలన 2021 నాటికి నూతనంగా ఓటు హక్కు వచ్చిన 18 సంవత్సరాలు నిండిన 3లక్షల 60వేల మంది యువ ఓటర్లకు అన్యాయం జరిగిందని ఆయన చెప్పారు. వీరిలో ఒకరినంటూ ధూళిపాళ్ల అఖిల పిటిషన్ వేశారు.
ఎస్ఈసీ ఆదేశాల వలన తాను ఓటు హక్కు కోల్పోయానని అఖిల పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు ఉంది. దీన్ని ఎస్ఈసీ కాలదన్నారని ఆమె అంటున్నారు. ఈ పిటిషన్‌పైనా ఏపీ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో వ్యతిరేక తీర్పు వచ్చినా హైకోర్టులో అనుకూల తీర్పు కోసం… అఖిల పిటిషన్ ద్వారా అధికార పార్టీ ప్రయత్నించే అవకాశం ఉంది.