సినిమాల్లో ఓ వెలుగు వెలిగాక.. రాజకీయాలవైపు అడుగెట్టాలని, అక్కడా రాజ్యమేలాలన్న ఆశ చిగురిస్తుందేమో..? అందుకే కొంతమంది స్టార్లు… రాజకీయాలవైపు అడుగులు వేశారు, వేస్తున్నారు. అయితే.. రాజకీయాలు అందరికీ అచ్చురావు. కొంతకాలం పోయాక, కొంత అనుభవం గడించాక గానీ, ఆ విషయం బోధ పడదు. చిరంజీవి గత కొంతకాలం నుంచీ రాజకీయాలపై విముఖంగానే ఉన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన మురళీ మోహన్ కూడా.. `రాజకీయాలు మనకెందుకు లెండి..` అంటూ నిరాశక్తత ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.
నటుడిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా కొంత పేరు గడించిన మురళీమోహన్ – ఆ తరవాత.. రాజకీయాల్లోనూ చేరారు. తెలుగుదేశం పార్టీ తరపున క్రియాశీలకంగా పనిచేశారు. రాజమండ్రి నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓ సారి ఓడిపోయారు. మరోసారి గెలిచారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక.. ఆయన రాజకీయంగా పూర్తిగా సైడ్ అయిపోయారు. అసలు ఆయన నోటి నుంచి రాజకీయాల మాటే రావడం లేదు. ఇప్పుడు ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇటీవల మురళీ మోహన్ అనారోగ్యం పాలయ్యారు. ఆపరేషన్ కూడా జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా.. రాజకీయాలకు దూరమయ్యానంటున్న మురళీ మోహన్.. ఇప్పుడు సినిమాలపై దృష్టి పెడుతున్నారు. `అతడు` లాంటి సినిమాల్ని అందించిన జయభేరి సంస్థ నుంచి కొత్త సినిమాల్ని రూపొందించడానికి కసరత్తులు చేస్తున్నార్ట. అంతేకాదు.. నటుడిగానూ మళ్లీ బిజీ అవ్వాలని తహతహలాడుతున్నారు. ఆర్కా మీడియా రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్లో కీలక పాత్ర పోషిస్తున్నారు మురళీ మోహన్.