ఈరోజు ముహూర్తం బాగుందేమో..? ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పట్టాలెక్కేశాయి. మహేష్ బాబు దుబాయ్ లో.. బిజీగా ఉంటే, పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో పనిలోకి దిగిపోయాడు. మహేష్ – పరశురామ్ కాంబినేషన్లో `సర్కారు వారి పాట` రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి దుబాయ్ లో షూటింగ్ మొదలెట్టారు. తొలి షెడ్యూల్ అంతా అక్కడే. నిజానికి అమెరికాలో ఈ షెడ్యూల్ జరగాల్సివుంది. అయితే.. వీసా అనుమతులు రావడంలో జాప్యం జరగడంతో, ఆ షెడ్యూల్ ని దుబాయ్ కి షిఫ్ట్ చేశారు.
మరోవైపు.. వవన్ కల్యాణ్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైపోయింది. మలయాళ రీమేక్ `అయ్యప్పయుమ్ కోషియమ్`లో పవన్ – రానా కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తున్నారు. హైదరాబాద్ లో ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ సైతం.. ఈరోజే సెట్లో అడుగుపెట్టనున్నాడు. తొలి షెడ్యూల్ అంతా హైదరాబాద్ లోనే. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కథానాయిక గా సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. అయితే అధికారికంగా తెలియాల్సివుంది.