సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల ప్రక్రియను రీ షెడ్యూల్ చేశారు. లెక్క ప్రకారం ఈ రోజు నుంచి మొదటి విడతకు నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేయలేదు. ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో… మొదటి దశ ఎన్నికలను చివరి దశకు మార్చారు. రెండు, మూడు, నాలుగో దేశ ఎన్నికలు ఆయా తేదీల్లోనే జరుగుతాయి. అయితే.. వాటిని ఒకటి, రెండు, మూడో దశ ఎన్నికలుగా మార్చారు. మొదట విడత జరగాల్సిన ఎన్నికలను నాలుగో విడతగా నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఉద్యోగ సంఘాల వ్యవహారంపై ఎస్ఈసీ సీరియస్గా దృష్టి సారించింది.
ఎన్నికల విధుల నిర్వహణకు కావాల్సిన ఉద్యోగులపై కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర సిబ్బందిని కేటాయించాలని కోరారు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ.. కొన్ని ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణలో పాల్గొనడంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాయని… కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సీఎస్ కూడా వ్యతిరేకంగా ఉన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించాలని ప్రభుత్వం అనుకుంటే.. ఉద్యోగులు కూడా అదే పని చేసే అవకాశం ఉంది. సీఎస్, డీజీపీ కూడా.. అదే బాట పడితే.. ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఉద్యోగుల్ని.. ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే.. పోలీసు సిబ్బంది కూడా సహకరించనందున కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతున్నట్లుగా భావించాల్సి ఉంటుదంటున్నారు.