ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరించారు. ఎస్ఈసీ నిర్వహించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సహకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్చోపచర్చలు జరిపిన తర్వాత… ఆయన తరపున ఆయన ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా మందుకు వచ్చి సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించారు. ఎస్ఈసీ నిర్ణయించిన ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇంత కాలం.. ప్రజారోగ్యం కోసమే ఎన్నికలు వద్దనుకున్నామని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీకి సహకరించాలా వద్దా అని కిందామీదా పడింది. తీర్పు వచ్చిన వెంటనే… ముందుగా అడ్వకేట్ జనరల్‌ను పిలిపించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు.
ఆ తర్వాత వరుసగా మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సతో పాటు డీజీపీ సవాంగ్ కూడా.. సమావేశానికి హాజరయ్యారు. అన్ని సమావేశాల్లోనూ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ పక్కనే ఉన్నారు. ఇంకొంత మంది ముఖ్యనేతలతో కలిసి నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ కారణంగా ఇతర సమీక్షలను రద్దు చేసుకున్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధానంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై దృష్టి సారించారు. ఎక్కడైనా సాంకేతిక అంశాల ఆధారంగా …మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉందో.. చూడాలని జగన్మోహన్ రెడ్డి ఏజీని కోరినట్లుగా తెలుస్తోంది. తీర్పులో.. ఎక్కడైనా ప్రభుత్వాన్ని సంప్రదించాలని కానీ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కానీ ఉంటే… మరో అవకాశం దక్కినట్లు అవుతుందని జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు భావించారు. అయితే అలాంటి చాన్సులేమీ తీర్పులో దక్కలేదు.
జడ్జిమెంట్ పరిశీలన తర్వాత మరే చాన్స్ లేకపోవడంతో చివరికి ఎన్నికలకు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎస్ఈసీని ఆదిత్యనాథ్ దాస్ కలుస్తారని.. సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్న లేఖ రాస్తారని అధికార పార్టీ సన్నిహిత మీడియా ముందుగానే మీడియాకు సమాచారం లీక్ చేసింది. తీర్పు వచ్చిన నాలుగైదు గంటల వరకూ రాలేదు. అయితే.. సుప్రీంకోర్టు తీర్పు చాలా విస్పష్టంగా ఉన్నందున.. ధిక్కరిస్తే.. ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుందన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో ఉంది. అడ్వకేట్ జనరల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో జగన్ ఎన్నికల నిర్వహణకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.