తెలంగాణలో రేపోమాపో కేటీఆర్ సీఎం అన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలందరూ పోటీ పడి మరీ.. అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఫిబ్రవరిలోనే పట్టాభిషేక ముహుర్తం అంటున్నారు. అయితే.. కొంత మంది మాత్రం దీన్ని నమ్మడం లేదు. కేసీఆర్ పదవి వదిలి పెట్టే అవకాశం లేదని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… ఇదే మాట చెబుతున్నారు. కేటీఆర్ గుంటకాడి నక్కలా సీఎం పదవి కోసం ఎదురు చూడాల్సిందేనని.. కేసీఆర్ ఎప్పటికీ కేటీఆర్‌ను సీఎం చేయరని జోస్యం చెప్పారు. మంత్రి పదవి పోతుందని భయపడేవారు.. కొత్తగా మంత్రి కోరుకుంటున్న వారే కేటీఆర్ సీఎం అంటున్నారని విశ్లేషించారు.
బీజేపీ నేతలు కేటీఆర్‌ను సీఎం చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు కానీ.. కేసీఆర్ రాజకీయాలను దగ్గర నుంచి చూసిన కొంత మంది మాత్రం నమ్మడం లేదు. ఇప్పుడు కాదు.. గత నాలుగేళ్ల నుంచి కేటీఆర్‌కు సీఎం పీఠం అనే ప్రచారాన్ని కేసీఆర్ చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికల్లాంటి పరిస్థితులు వచ్చినా అది గెలవగానే కేటీఆర్‌కు పీఠం అన్న ప్రచారం చేశారు. కానీ ఎప్పుడూ మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడు ఓటమి బాటల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారం చేస్తున్నారు.
ఇప్పుడు సీఎం పదవి మారిస్తే.. రాజకీయంగా టీఆర్ఎస్ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిఉంటుందని రాజకీయపార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ రిస్క్ తీసుకోరని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి అదే కారణం అని భావిస్తున్నారు. కేటీఆర్ ను సీఎం చేసేదాకా.. ఇలాంటి కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయని టీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు.