తెలంగాణ సీఎం కేసీఆర్ క్రమంగా పార్టీపై.. పార్టీ నేతలపై పట్టు కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన కుమారుడికి పట్టం కట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న సమాచారం బయటకు వచ్చిన తర్వాత పార్టీ నేతలు… కేటీఆర్‌కు మద్దతుగా ప్రకటనలు చేసేవారితో పాటు… తమదైన భిన్నమైన రాజకీయం చేసే నేతలు కూడా.. ఎక్కువైపోయారు. వివాదాస్పద ప్రకటనలు చేస్తూ… పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నారు. నిన్నామొన్నటి వరకూ.. మీడియా ముందు ఏం మాట్లాడాలన్నా.. ప్రగతి భవన్ నుంచి పాయింట్లు అందేవి. వాటికి మించి ఒక్కటి కూడా ఎక్కువ మాట్లాడటానికి లేదు. కానీ ఇప్పుడు… అలాంటి పాయింట్లు ఏవీ అందకపోయినా నేతలు మాట్లాడేస్తున్నారు. గతంలో ఉన్నంత భయం ఇప్పుడు లేదు.
ఏం మాట్లాడితే ఏం అవుతుందో అన్న ఉద్దేశంతో చాలా మంది నేతల్ని టీవీ చర్చలకు వెళ్లకుండా టీఆర్ఎస్ కట్టడి చేసింది. కేటీఆర్‌కు అనుకూలంగా ప్రకటనలు చేయడానికి మాత్రం ప్రస్తుతానకి టీఆర్ఎస్ హైకమాండ్ స్వేచ్ఛ ఇచ్చింది. దీన్ని ఆ పార్టీ నేతలు మరింత అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. విపక్ష నేతల్ని విమర్శిస్తున్నామని అనుకుంటున్నారో.. సొంత పార్టీ నేతల్ని బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంటున్నారో కానీ… ప్రకటనలు ప్రారంభించారు. అయోధ్య రాముడి గుడి విరాళాలపై ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన ప్రకటన అలజడికి కారణం అయింది. వెంటనే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి.. విరాళం ఇప్పించి… మరీ వివాదాస్పదం కాకుండా చేయగలిగారు.
రామ మందిర్ విరాళాల విషయంలో చెలరేగిన వివాదం పూర్తిగా తగ్గక ముందే మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరో బాంబు పేల్చారు. ఆయన నేరుగా పార్టీ తీరు పైన సెటైర్లు వేశారు. తానొక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. స్వేచ్చగా పాడలేకపోతున్నానని, మాట్లాడలేక పోతున్నాని స్వేచ్ఛ లేకుండా పోయిందని తాను ఇలాంటి జీవితాన్ని కోరుకోలేదని నిర్వేదంతో మాట్లాడారు. కవులు, కళాకారుల మౌనం కేన్సర్ కంటే ప్రమాదకరమన్నారు. రసమయిని కేబినెట్ లోకి తీసుకుంటామని స్వయంగా కేసీఆరే ఓ బహిరంగంగా ప్రకటించారు. కానీ అది ఇప్పటి వరకు జరగలేదు. అందుకే తనను గుర్తించాలని..కేటీఆర్ మంత్రివర్గంలో చోటు కోసం ఇలాంటి రాజకీయం ప్రారంభించారని టీఆర్ఎస్ వర్గాలు గొణుక్కుంటున్నాయి.
టీఆర్ఎస్లో ముందు ముందు ఇలాంటి రాజకీయం మరింత జోరందుకుంటుందని… ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆరే తెచ్చారని.. ఎలా కంట్రోల్ చేయాలో ఆయనకు తెలుసన్న అభిప్రాయం.. ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.