మన చుట్టూనే తిరుగుతూంటారు. మామూలుగానే ఉంటారు. కానీ వారి గురించి నిజాలు తెలిసినప్పుడే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి నేరస్తుడొకరు హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో ప్రశ్నిస్తే.. తానేం తప్పు చేయలేదన్నట్లుగా చేసిన నేరాలన్నింటినీ బయట పెట్టడంతో పోలీసులూ షాక్కు గురయ్యారు. కనీసం ఇరవై మంది మహిళల్ని అతను చంపేశాడు. సీరియల్ కిల్లర్లాగా అతను అదే పనిలో ఉండేవాడు. అతడు చంపేసిన వారి వివరాలను కొన్ని కూపీలాగితే.. నిజమేనని.. అదృశ్యమయ్యారని తేలడంతో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు హైదరాబాద్ పోలీసులు.
హైదరాబాద్ శివారులో అంకుషాపూర్ అనే గ్రామం దగ్గర ఓ మహిళ హత్యకు గురయింది. గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఉంది. పోలీసులకు ఓ చిన్న క్లూ దొరకడంతో దాని ఆధారంగా కొద్ది కొద్దిగా కూపీ లాగడం ప్రారంభించారు. చివరికి… అసలు ఆ మహిళతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి వద్దకు ఆ కూపీ చేరింది. అతన్ని ప్రశ్నిస్తే…అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె మద్యం దుకాణం వద్ద ఒంటరిగా కనిపించింది. కలిసి మద్యం తాగుదామంటూ… ఓ బాటిల్ కొని… గుట్టల్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. తర్వాత ఏం జరిగిందో కానీ.. ఆమెను అక్కడే చంపేసి.. పెట్రోల్ పోసి తగులపెట్టి వచ్చేశాడు. అంతకు ముందు ఆ మహిళతో కనీస ముఖ పరిచయం కూడా లేకపోవడంతో… అతనిపై అనుమానపడేవారు కూడా ఎవరూ లేరు . కానీ మద్యం దుకాణం దగ్గర.. ఆటో ఎక్కుతున్న సమయంలో రికార్డైన సీసీ టీవీ దృశ్యాలే పట్టించాయి.
చివరికి అతన్ని పట్టుకుని ప్రశ్నించిన పోలీసులకు… షాకింగ్ నిజాలు తెలిశాయి. ఇలా కల్లు కాంపౌండ్ల దగ్గర.. మద్యం దుకాణాల దగ్గర ఉండే మహిళలతో మాటలు కలిపి… వారిని మద్యం తాగే నెపంతో చెట్టుపుట్టల్లోకి తీసుకెళ్లి మద్యం తాపించి హత్య చేసి .. తగులబెట్టి వచ్చేవాడు. ఇలా పదహారు మందిని చంపానని అతను అంగీకరించాడు. వీరందరిపై పోలీసులు ఆరా తీశారు. కొంత మంది మహిళల కుటుంబసభ్యులు కనీసం మిస్సింగ్ కేసులు కూడా పెట్టలేదు. కొంత మంది పెట్టినా పోలీసులు పట్టించుకోలేదు. కానీ వారంతా లేరు. దాంతో హత్యలు నిజమేనన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చారు. మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్ కల్లు దుకాణాల వద్ద… మద్యం దుకాణాల వద్ద మహిళలు కనిపిస్తూ ఉంటారు. కూలీనాలీ చేసుకునే కొంత మంది మహిళలు మద్యానికి అలవాటు పడి ఉంటారు. ఇలాంటి వారిని సీరియల్ కిల్లర్ టార్గెట్ చేశాడు. మద్యం తాగడం వరకూ సరే.. ఎందుకు చంపుతున్నాడనేది పోలీసులకు అంతు చిక్కని వ్యవహారంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు పరిశోధిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో మీడియా ముందు రాచకొండ పోలీసులు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.