వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న పళంగా.. తన న్యాయబృందం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయనను న్యాయవ్యవస్థకు బద్ద వ్యతిరేకిగా తీర్చిదిద్దేలా.. ఆయన న్యాయ సలహాదారులు.. ఇతర బృందం… తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయి. చట్ట, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు కోర్టుల్లో నిలబడవని.. సామాన్యులు కూడా అంచనా వేయగలిగే అంశాలను.. సుప్రీంకోర్టు వరకూ తీసుకెళ్లి.. ప్రభుత్వానికి మొట్టికాయలు వేయిస్తోంది… జగన్ లా టీం. మొదటి నుంచి అనేక అంశాల్లో ఇలాగే చేసినా.. చివరికి ఎస్ఈసీ విషయంలో జగన్‌ను ఆయన లా టీం తప్పుదోవ పట్టించినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.
జగన్ పెట్టుకున్న “లా టీం”కు బేసిక్స్ కూడా తెలియవా..?
ఓ ముఖ్యమంత్రి అన్ని వ్యవహారాలను చక్క బెట్టుకోలేరు… ఆయన తరపున వ్యవహారాలు చక్క బెట్టడానికి ఓ వ్యవస్థ ఉంటుంది. అందులో సలహాదారులు.. అధికారులు.. అంటారు. అలాగే న్యాయ వ్యవహారాలు చూడటానికి కూడా ఓ టీం ఉంటుంది. అయితే… ఈ టీం జగన్మోహన్ రెడ్డికి మంచి చేయడంలేదు సరి కదా… చట్ట విరుద్ధమైన సలహాలతో.. హైకోర్టులోనూ.. సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం పరువు పోయేలా చేస్తున్నారు. ఎస్ఈసీ ఉన్న రాజ్యాంగపరమైన హక్కులపై పదో తరగతి పిల్లవాడికి కూడా అవగాహన ఉంటుంది. కామన్సెన్స్ ఉన్న వారెవరైనా ఎస్ఈసీతో తేగేదాకా లాక్కోవాలనుకోరు. దీన్ని పట్టుకుని రెండు సార్లు సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ చీవాట్లు తినిపించారంటే… ఆ న్యాయసలహాదారులకు.. కామన్సెన్స్ లేదని సులువుగా అర్థమైపోతుంది. ఇప్పుడు పోయింది.. ఆ నిర్ణయాలు తీసుకున్న వారి పరువు కాదు.. ప్రభుత్వానిది. కోర్టులంటే.. ప్రభుత్వానికి లెక్క లేదన్న ఓ ఇమేజ్ ప్రభుత్వంపై పడే ప్రమాదం ఏర్పడింది. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన ఈగో వ్యాఖ్యలు … ప్రభుత్వ పరువును పోగొట్టినట్లయింది.
ఎస్ఈసీ విషయంలో న్యాయసలహాదారులు అట్టర్ ఫ్లాప్..!
ఎస్ఈసీ విషయంలో ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి ఆత్రంగా వ్యవహరించిందే తప్ప.. న్యాయపరమైన అంశాలనుప రిగణనలోకి తీసుకోలేదు. పిటిషన్లు వేయడం..ఉపసంహరించుకోవడమే కాదు.. వేస్తున్న పిటిషన్లలోనూ క్లారిటీ ఉండటం లేదు. మొదటగా ఎస్ఈసీని తొలగించే ఆర్డినెన్స్ చట్ట విరుద్ధమని.. హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వతా తర్వాత ప్రభుత్వంలో కంగారు మరీ ఎక్కువైపోయి… ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంది. అసాధారణ రీతిలో అడ్వకేట్ జనరల్‌తో ప్రెస్‌మీట్ పెట్టించి.. హైకోర్టు తీర్పునకే..కొత్త అర్థం చెప్పి.. నిమ్మగడ్డ నియామకంపైనే అనుమానాలు వ్యక్తం చేయడమే కాదు.. దాన్నే న్యాయ సలహాగా తీసుకుని.. అప్పటికప్పుడు… నిమ్మగడ్డ.. ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకున్న ఉత్తర్వులను ఉపసంహరించేశారు. స్టే కోసం హైకోర్టులో.. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. వైసీపీ వ్యూహకర్తలు.. వారికి న్యాయసేవలు అందిస్తున్న నిపుణులకు.. ఏం చేయాలో తోచక.. హైకోర్టులో తీర్పు అమలుపై స్టే కోరుతూ.. తాము దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకున్నారు . దీనికి హైకోర్టు ఆమోదం తెలిపింది. అయితే.. ఈ ఇక్కడ పిటిషన్లు ఉపసంహరించుకోవడం పూర్తిగానే స్పెషల్ లీవ్ పిటిషన్లు తప్పుల తడకగా ఉన్నాయని తేలింది. అందులోనూ అనేక లోపాలున్నాయి. తాజాగా ఎన్నికలు నిర్వహించాలంటూ.. హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఎస్ఎల్పీ వేయడం కూడా చేత కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్న లాయర్లు.. న్యాయనిపుణులు మిడిమిడి జ్ఞానంతో వ్యవహరిస్తూ.. ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నారన్న అభిప్రాయాలు వైసీపీలోనే వ్యక్తమవుతున్నాయి. న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తగలడం ఒకటి అయితే.. . కనీసం పిటిషన్లు కరెక్ట్ గా వేయడం రాకపోవడం ఏమిటన్న ఆశ్చర్యం అధికార పార్టీలో వ్యక్తమవుతోంది.
” కోర్టులను ధిక్కరించే సర్కార్ ” అన్న ఇమేజ్‌కు కారణం “లా టీం”..!
ప్రభుత్వానికి కోర్టుల్లో వందకుపైగా సార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ నిర్ణయాలు చట్టపరంగా ఉండేలా చూసుకోవడంలో.. వాటిపై కోర్టుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వ లాయర్లు విఫలమయ్యారని స్పష్టమవుతోంది. గతంలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఓ తప్పు జరిగిన తర్వాత ఆ తప్పు కప్పి పుచ్చుకోవడానికి న్యాయ బృందం.. రకరకాల విన్యాసాలు చేసి.. కోర్టులకు వెళ్లి మళ్లీ ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా.. కోర్టు తీర్పులను ధిక్కరించేలా.. చేస్తోంది కానీ.. సరైన సలహాలు ఇవ్వడడం లేదన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. చివరికి న్యాయవ్యవస్థపై దాడి చేసేంత వరకూ పరిస్థితి వెళ్లింది. జడ్జిల మీద కుట్రలు చేయడం.. సోషల్ మీడియాలో బ్లాక్ మెయిలింగ్ చేయడం లాంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు మొత్తంగా దెబ్బపడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన న్యాయబృందం విషయంలో ఇప్పటికైనా సమీక్ష చేసుకోకపోతే.. ముందు ముందు మరింత గడ్డు పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదన్న విశ్లేషణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.