పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒకే ఒక్క అజెండా పెట్టుకున్నారు. అది ప్రజాసమస్యలు.. తెలంగాణ ప్రయోజనాలు.. విభజన హామీలులాంటివి కాదు. టీఆర్ఎస్ అవినీతిని… ఢిల్లీలో ప్రచారం చేయడం. టీఆర్ఎస్ అదే పనిగా అవినీతి చేసిందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిందో చెప్పాలని ప్రశ్నించడం. కాంగ్రెస్ తరపున గెలిచిన ముగ్గురు తెలంగాణ ఎంపీలు గాంధీభవన్లో సమావేశం అయ్యారు. ఈ ముగ్గురులో ఒకరు ప్రస్తుతం పీసీసీ చీఫ్ ఉత్తమ్, మరో ఇద్దరు పీసీసీ చీఫ్ పదవి కోసం అదే పనిగా పోరాడుతున్న కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి. వీరు ముగ్గురూ సింగిల్ అజెండాగా కేసీఆర్ అవినీతిని పార్లమెంట్లో కూడా చర్చకు పెట్టాలని నిర్ణయించారు.
స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయని అవినీతి కేసీఆర్ చేశాని… కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల అవినీతి పై సీబీఐ విచారణ జరిపించాలని పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ అవినీతి అంతటికి ఆధారాలున్నాయని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా చెబుతున్నారని.. అయినా ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి పై చర్యలు ఎందుకు తీసుకోలేదో అడుగుతామని ఎంపీలు చెబుతున్నారు. పార్లమెంట్లో రాజకీయ ఆరోపణలపై ఎలా మాట్లాడుతారో కానీ.. ముగ్గురు ఎంపీలు మాత్రం తమ టార్గెట్ అదే అంటున్నారు.
ప్రజాసమస్యలపైనే.. అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఎంపీలే పట్టించుకోకపోతే.. తాముఎందుకు పట్టించుకోవాలన్నట్లుగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ.. రైతు చట్టాలు లాంటి వాటిపై కానీ కేంద్రంతో విబేధించే పరిస్థితుల్లో ఒక్క పార్టీ కూడా లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నా… వారిది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ అంశాలు హైలెట్ అవుతాయి. కానీ ఎలాగైనా సరే… టీఆర్ఎస్ అవినీతిని చర్చనీయాంశం చేయాలని పట్టుదలగా ఢిల్లీకి వెళ్తున్నారు.