సుప్రీంకోర్టు తీర్పునైనా ధిక్కరిస్తామని ఒకరు…మా ప్రాణానికి హాని కల్పిస్తే చంపడానికైనా సిద్ధమని మరొకరు.. మమ్మల్ని ఆదేశించడానికి ఎస్ఈసీ ఎవరని మరొకరు…. వరుసగా ఒకరి తర్వాతా ఒకరు మీడియా ముందుకు వచ్చి సర్కస్ ఫీట్లులా ప్రకటనలు చేసిన ఉద్యోగ సంఘ నేతలు చల్లారిపోయారు. ప్రభుత్వం తాము ఎన్నికలకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పగానే.. ఆటోమేటిక్గా ఉద్యోగ సంఘాల నేతల అఅభిప్రాయాలు.. ఆ కోణంలోకి మారిపోయాయి. ఇప్పుడు వారి ప్రకటనలు… ఇంకాస్త భిన్నంగా ఉన్నాయి. మేము ఎప్పుడూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని చెప్పలేదని.. ఎస్ఈసీతో కూడా తామెప్పుడూ విబేధించలేదని… ఉద్యోగుల అభిప్రాయం అంటే.. తనొక్కడి అభిప్రాయమే అన్నట్లుగా చెలరేగిపోయిన వెంకట్రామిరెడ్డి తాజాగా గొంతు సవరించుకున్నారు.
చంద్రశేఖర్ రెడ్డి అనే ఎన్జీవో సంఘం నేత…ఎస్ఈసీపై కిందా మీదా పడిన బొప్పరాజు వెంకటేశ్వర్లు అనే నేత కూడా.. తాము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పుకున్నారు. ప్రభుత్వం ఎన్నికలు వద్దని చెప్పినంత కాలం వీరిద్దరూ.. సుప్రీంకోర్టు తీర్పునైనా వ్యతిరేకిస్తాం… మాకు ప్రాణాలు ముఖ్యమంటూ ప్రకటనలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ విధానం ప్రకారం… మాట మార్చేసుకున్నారు. వీరందరూ ఫార్మాలిటీగా చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ ధాస్ ను కలిశారు.
ఎన్నికలకు సహకరిస్తామని చెప్పుకొచ్చారు. సహకరించకపోతే.. జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో… సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న ఘాటు వ్యాఖ్యల తర్వాత వారికి క్లారిటీ వచ్చి ఉంటుంది. ఒక వేళ ప్రభుత్వ పెద్దలు అదే ధిక్కారంతో ఉంటే.. ఉద్యోగ నేతలు కూడా అదే ప్రకటనలు చేసి ఉండేవారనడంతో సందేహం లేదు. ప్రభుత్వ పెద్దల గుప్పిట్లో రాజకీయంగా పావులుగా మారి వారు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నా… వారు లెక్క చేయడం లేదు.