`టీజర్ వదలుతావా.. లేదంటే లీక్ చేసేయ్యమంటావా` అంటూ కొరటాల శివకు స్వీట్ అండ్ సెటైరికల్ వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి. `ఆచార్య` టీజర్‌పై చిరు తనకు తాను వేసుకున్న సెటైర్ ఇది. దానికి కొరటాల కూడా తలొంచాడు. `టీజర్ లీక్ చేయొద్దు.. నేను విడుదల చేస్తా` అని మాట ఇచ్చాడు. అన్నట్టే.. ఇప్పుడు టీజర్ కి సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ఈనెల 29న సాయింత్రం 4 గంటల 5 నిమిషాలకు ఆచార్య టీజర్ వస్తోంది. నిజానికి రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26నే టీజర్ ని తీసుకొద్దామనుకున్నారు. టీజర్ షాట్లు కూడా కట్ చేసేశారు. అయితే.. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో ఆలస్యం అవ్వడంతో.. టీజర్ కాస్త ఆలస్యం అయ్యింది. అయితే 29న మాత్రం పక్కాగా వచ్చేస్తోంది. ధర్మస్థలి నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ ఊరితో పాటు… ఆచార్యగా చిరు పాత్రని పరిచయం చేసే టీజర్ ఇది. రామ్ చరణ్ మాత్రం ఈ టీజర్లో కనిపించడు. ఎందుకంటే.. రామ్ చరణ్ ఇటీవలే సెట్స్ పైకి వచ్చాడు. చరణ్ రాకముందే… టీజర్ షాట్స్ అన్నీ పూర్తి చేశాడు కొరటాల. ఈ వేసవికి ఆచార్య థియేటర్లలోకి వస్తున్నాడు.