హైదరాబాద్: విలక్షణ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కాపు సామాజికవర్గ నేత ముద్రగడ పద్మనాభాన్ని కలవటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన తండ్రి ఆదేశాలమేరకు పద్మనాభాన్ని కలిశానని విష్ణు మీడియాకు చెప్పారు. ముద్రగడ ఏదైనా తలపెడితే అది కార్యరూపం దాల్చేవరకు ఊరుకోరని, ఆయన చాలా మొండివారని తన తండ్రి చెప్పినట్లు విష్ణు తెలిపారు. తన అభిమాని కుమార్తె వివాహానికి హాజరవటానికి మండపేట వచ్చానని, ముద్రగడను కిర్లంపూడిలో కలుద్దామనుకుని ముందుగా ఫోన్ చేస్తే, ఆయన ఒక పెళ్ళికి హాజరవటానికి కాకినాడ వచ్చి ఉన్నారని తెలియటంతో అక్కడే కలిశానని చెప్పారు.
ముద్రగడ పద్మనాభంపై మోహన్ బాబుకు అంత ప్రత్యేక అభిమానానికి కారణమేమిటి అన్నది అంతుబట్టటంలేదు. మోహన్ బాబు గురువు దాసరి నారాయణరావు ముద్రగడ ఇటీవల నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో వెళ్ళి కలిసిన సంగతి తెలిసిందే. ఆ కనెక్షన్ తప్పిస్తే ముద్రగడకు, మోహన్ బాబుకు మధ్య సంబంధమేమీ లేదు. మరి విష్ణును ప్రత్యేకంగా పంపటం వెనక ఆంతర్యం ఏమిటో తెలియాల్సిఉంది. మరోవైపు ముద్రగడను కలవటంపై విష్ణు ట్విట్టర్లో స్పందించారు. ముద్రగడ పద్మనాభం ఎంత సింపుల్గా, వినయంగా ఉన్నారో అంటూ ఆశ్చర్యపోయారు. ఆయన నిరాడంబరత, గౌరవాన్ని చూసి తాను మైమరచిపోయానని, గోదావరి మర్యాదలను ఎవరూ అధిగమించలేరని ట్వీట్ చేశారు.