తెలంగాణ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న వేతన సవరణ నివేదిక వారికి షాకిచ్చింది. కేవలం 7.5శాతం ఫిట్మెంట్ మాత్రమే సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాలు కనీసం 30 నుంచి 40శాతం ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014లో తొలి సారి కేసీఆర్ సర్కార్ ఫిట్ మెంట్ ప్రకటించింది. అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యోగులందరూ ఉద్యమించడం కీలకంగా మారింది. రాష్ట్రం ఏర్పడటంలో వారి పాత్ర కీలకం కావడంతో కేసీఆర్… అప్పట్లో సిఫార్సుల కన్నా ఎక్కువగా ఏకంగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దాంతో ఉద్యోగ సంఘాలన్నీ ఖుషీ అయ్యాయి. తెలంగాణ ప్రకటించింది కాబట్టి… ఏపీ ఉద్యోగుల్ని నిరాశ పరచడం ఇష్టం లేక.. ఆర్థిక సమస్యలున్నా.. ఏపీ ప్రభుత్వం కూడా అంతే ఫిట్మెంట్ ప్రకటించింది.
ఇప్పుడు మరోసారి పీఆర్సీ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఎప్పుడో ముందస్తు ఎన్నికలకు ముందే రావాల్సింది. కానీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా.. రెండేళ్ల పాటు నాన్చి నాన్చి ఇప్పుడు నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పుడు బహిర్గతం చేసింది. అందులో.. ఫిట్మెంట్ను కేవలం 7.5శాతానికి మాత్రమే సిఫార్సు చేశారు. అయితే కొన్ని సూచనలు ఉద్యోగులకు కూడా సంతృప్తినిచ్చేలా ఉన్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడం..ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలు .. గరిష్ట వేతనం 1,62,070 వరకు ఉండొచ్చన్న సిఫార్సులు చేసింది. గ్రాట్యుటీ పరిమితి రూ. 16 లక్షలు.. శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంచాలని సిఫార్సు చేసింది.
అయితే ఈ సిఫార్సులే ఫైనల్ కాదు. ఉద్యోగ సంఘాలతో సిఫార్సులపై సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చర్చించనుంది. పీఆర్సీ కమిటీనే ఇంత తక్కువ సిఫార్సు చేసినప్పుడు ఉద్యోగులు… 30 శాతం.. 40 శాతం అడిగే చాన్స్ ఉండదు. అంత పెద్ద మొత్తంలో ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చేసే అవకాశం ఉంది. అయితే ఐఆర్ కూడా ఇవ్వకుండా… పీఆర్పీ కూడా ఏడున్నర శాతానికి పరిమితం చేస్తే ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ఏపీ సర్కార్ మధ్యంతర భృతినే 27శాతం ఇస్తోంది. అంటే.. ఆ మేరకు వేతన సవరణ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ సర్కార్ అది కూడా ఇవ్వలేదు. మరి ఉద్యోగులు ఏం చేస్తారో చూడాలి..!