అక్కినేని కుటుంం అంటే విక్రమ్ కె.కుమార్‌కీ, విక్రమ్ అంటే అక్కినేని కుటుంబానికి ప్రత్యేక అభిమానం. `మనం` లాంటి సినిమా ఇచ్చి… అక్కినేని వంశానికి తీయ్యటి జ్ఞాపకం మిగిల్చాడు విక్రమ్. అందుకే `హలో` ఫ్లాప్ అయినా… నాగచైతన్యతో మరో సినిమా (థ్యాంక్యూ) మొదలెట్టగలిగాడు.
ఇప్పుడు మరోసారి అక్కినేని హీరోలందరితో కలిసి ఓసినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. `మనం` లాంటి ఓ మంచి ఫ్యామిలీ కథ విక్రమ్ మదిలో మెదిలిందని, అందులో నాగార్జున – నాగచైతన్య – అఖిల్ తో పాటు అక్కినేని కుటుంబంలోని సుమంత్, సుశాంత్, అమల, సమంతలు కూడా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. `మనం 2`లో అమల, సుమంత్, సుశాంత్ కి ఛాన్స్ దొరకలేదు. ఈసారి.. వాళ్లకూ కథలో కీలకమైన పాత్రలు లభిస్తాయని తెలుస్తోంది. మనం కథకీ, ఈ కథకీ ఎలాంటి పోలికలూ, సంబంధమూ లేదు. జస్ట్… అక్కినేని హీరోలందరికీ సరిపడ కథ అన్నమాట. ఇలా.. ఓ కుటుంబంలోని హీరోలంతా కలిసి నటించే సినిమా బహుశా.. ఇప్పటి వరకూ రాలేదేమో. మూడు తరాల హీరోల్ని ఒకచోట చేర్చి `మనం` లాంటి క్లాసిక్ ని అందించిన విక్రమ్.. ఈసారి ఏం చేస్తాడో??