తమ్ముడు పవన్ కల్యాణ్‌కు చిరంజీవి నైతిక మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ.. జనసేన నేత నాదెండ్ల మనోహర్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీజేపీతో తిరుపతి ఉపఎన్నికలు, పంచాయతీల్లో కలసి పోరాటం చేయడంపై చర్చలు జరిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రస్తావన తీసుకు వచ్చారు. పవన్ రాజకీయ ప్రస్థానంలో తాను ఉంటానని చిరంజీవి చెప్పారని నాదెండ్ల గుర్తు చేసుకున్నారు. నైతిక మద్దతు ఇస్తారని తర్వాత చెప్పారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి ఉండటం అంటే ఏమిటో చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ… చిరంజీవి నేరుగా రాజకీయాల్లో వస్తారా అన్న అంశంపై చర్చోపచర్చలు ప్రారంభించారు.
గత ఎన్నికలకు ముందు చిరంజీవి ఫ్యాన్స్ మొత్తాన్ని అధికారికంగా జనసేనలో చేర్చారు. తాను ఇక రాజకీయాలకు గుడ్ బై అని చిరంజీవి అధికారికంగా ప్రకటించలేదు కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం ప్రకటించారు. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇక రారని జాతీయ మీడియాకు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో చిరంజీవి కూడా పూర్తి సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఏ ప్రభుత్వంపైనా విమర్శలు చేయడం లేదు. ప్రభుత్వాలతో సఖ్యతగా ఉంటున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తున్నారు.
అయితే రాజకీయాల్లో ఏ నిర్ణయమూ శాశ్వతం కాదు. పరిస్థితులు మారితే.. పవన్ కల్యాణ్‌కు తోడుగా చిరంజీవి రంగంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని నాదెండ్ల మనోహర్ ప్రకటనల్ని ఆ దిశగానే చూడాలని అంటున్నారు. మరో వైపు తిరుపతి ఉపఎన్నిక సీటును జనసేనకు కేటాయిస్తే.. చిరంజీవి మద్దతు కూడా ఉంటుందనే రీతిలో బీజేపీపై ఒత్తిడిలో పెంచడానికి నాదెండ్ల మనోహర్ అలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా చెబుతున్నారు. మొత్తానికి చిరంజీవి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.