`జనసేన వెంట చిరంజీవి` ఇదీ.. మధ్యాహ్నం నుంచీ టీవీ ఛానళ్లు హోరెత్తించేస్తున్న వార్త. టీవీ 9 అయితే.. ఈ విషయంలో ప్రత్యేక కార్యక్రమమే రన్ చేసేస్తోంది. చిరంజీవి, జనసేన వెంట ఉన్నారని, పవన్‌కి మద్దతు ఇవ్వబోతున్నారని, త్వరలోనే ఆయన జనసేనకు క్రీయాశీలంగా వ్యవహరించబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం.
అయితే ఈ వార్త ఎలా పుట్టింది? అన్నది ఆసక్తి కరం. ఈరోజు విజయవాడలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తల్నీ అభిమానుల్నీ ఉద్దేశిస్తూ మాట్లాడిన నాదెండ్ల మనోహర్.. “రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండి, సినిమాలకు దూరం అవ్వడం చిరంజీవికి ఇష్టం లేదు. సినిమాలు చేయ్మని చిరంజీవి సలహా ఇచ్చారు. పవన్‌కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానన్నారు“ అని నాదెండ్ల వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు దీన్నే రౌండప్ చేస్తున్నాయి టీవీ ఛానళ్లు. `అదిగో… చిరు జనసేనలో చేరిపోతున్నారు` అంటూ వార్తలు పుట్టించేయడం మొదలెట్టారు. అంతేనా? త్వరలో రాష్ట్రంలో జరిగే పంచాయితీ ఎన్నికల్లో, తిరుపతి ప్రచారంలో.. చిరు కీలకంగా మారబోతున్నారంటూ.. వ్యాఖ్యానాలు జోడించేస్తున్నారు. అసలు నాదెండ్ల ఏం మాట్లాడారో, వీళ్లకు ఏం అర్థం అయ్యిందో అర్థం కాదు. అన్ని విధాలా అంటే… రాజకీయంగానూ అనే అర్థం వుందా? `ప్రజారాజ్యం`దెబ్బకు చిరంజీవి… హడలి పోయి, ఇంకా అందులోంచి తేరుకోలేదు. ఆయన ముందు ఎప్పుడు రాజకీయాల ప్రస్తావన తెచ్చినా.. `నేను వాటి గురించి ఆలోచించడం లేదు` అని క్లారిటీగా చెప్పేసేవారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసేసుకున్నారాయన. సినిమాల్లోనే ఇప్పుడు ఆయన ప్రశాంతంగా కనిపిస్తున్నారు. అలాంటి చిరు.. పనిగట్టుకుని మళ్లీ ఈ రొంపిలోకి దిగుతారని ఆయన అభిమానులు కూడా అనుకోవడం లేదు. పైగా జనసేన పరిస్థితి అంతంత మాత్రంగానే వుంది. ఆ పార్టీ బలోపేతమై, అధికారాన్ని చేపట్టే అవకాశాలైతే దగ్గర్లో లేవు. అలాంటప్పుడు ఆయన జనసేన జెండా మోస్తారనుకోవడం అత్యాసే. `అన్నివిధాలా తోడుగా ఉంటా` అనడంలో చిరు ఉద్దేశ్యాలు వేరు కావొచ్చు. లేదంటే.. కేవలం అభిమానుల్ని ఉత్సాహపరచడానికి నాదెండ్ల మనోహర్.. చేసిన వ్యాఖ్యలు కావొచ్చు. ఏదేమైనా ఇలాంటి విషయాల్లో చిరంజీవి నే స్వయంగా ఓ ప్రకటక చేసేంత వరకూ.. దాని గురించి ఆలోచించక పోవడమే మంచిది.