ఉద్యోగ సంఘాలు అడుగుతోంది 63 శాతం ఫిట్మెంట్. బిశ్వాల్ కమిటీ సిఫార్సు చేసింది ఏడున్నర శాతం. రెంటికి పోలిక కూడా లేదు. తెలంగాణ ఉద్యోగులు కొద్ది రోజులుగా వేతన సవరణ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో 43 శాతం ఇచ్చారని ఈ సారి 63 శాతం ఆశిస్తున్నామని గతంలో ప్రకటనలు చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కూడా.. దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తూండటంతో తమకు పీఆర్సీ భారీగానే ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశిస్తూ వస్తున్నారు. ఆ కమిటీ రిపోర్ట్ బుధవారం బయటకు వచ్చింది. అందులో కేవలం ఏడున్నర శాతమే ఫిట్ మెంట్ .. ఇంటి అద్దె భత్యాన్ని తగ్గించాలని సిఫార్సు చేయడంతో ఉద్యోగులు షాక్కు గురయ్యారు.
పీఆర్సీ నివేదికపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా వివిధ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. సీఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగసంఘాలకు వివరించిన సీఎస్.. పీఆర్సీ ఫిట్మెంట్ విషయంలో సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఉద్యోగుల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పీఆర్సీపై సీఎం వద్ద తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. అది పీఆర్సీ నివేదిక కాదు.. అది పిసినారి నివేదిక అని త్వరలో సీఎంను కలుస్తామని ప్రకటించారు.
మరీ ఏడున్నర శాతం ఫిట్ మెంట్ సిఫార్సు చేయడం కింది స్థాయి ఉద్యోగుల్ని కూడా ఆశ్చర్య పరిచింది. మరీ ఇంత తక్కువ ఇవ్వరని నమ్మకంగా ఉన్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అలాగే ఉంటాయి. మొదట పూర్తి స్థాయిలో నిరాదరణ చూపుతారు. చివరికి వారంతా ఆశలు వదులుకుంటున్న సమయంలో ఊహించనంత ఆదరణ చూపుతారు. దాంతో వారు పాలాభిషేకాలు చేస్తారు. అందుకే… పీఆర్సీ ఇంత తక్కువ సిఫార్సు చేసినా… ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పడానికి ప్రభుత్వం ఇలాంటి వ్యూహం అమలు చేస్తోందని.. కనీసం నలభై శాతం అయినా ఇస్తారని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. పీఆర్సీ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నారని విపక్ష నేతలు కొత్తగా విమర్శలు ప్రారంభించారు..