నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగాని తిట్ల వర్షం కురిపిస్తున్నారు. రిటైర్డ్ ఆఫీసర్ ఆయన మాట మేం వినేదేంటి అని పెద్దిరెడ్డి లాంటి మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఇద్దరూ వీటితోనే ఆగిపోవడం లేదు. తమకు ఏది వ్యతిరేకంగా ఉంటే.. దాన్ని చంద్రబాబుకు లింక్ పెట్టేసే వ్యూహాన్ని ఇక్కడా అమలు చేస్తూ.. దాదాపుగా బ్లాక్మెయిల్ చేయాలన్నట్లుగా చూస్తున్నారు. చివరికి వీరి వ్యాఖ్యలపై నిమ్మగడ్డ గవర్నర్కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. వారిని కంట్రోల్లో ఉంచాలని… అనుచిత వ్యాఖ్యలు చేయకుండా చూడాలని నిమ్మగడ్డ కోరినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ.. అదే రోజు సాయంత్రం మళ్లీ మళ్లీ పెద్ది రెడ్డి, సజ్జల ఇంకొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రెచ్చగొట్టి నిమ్మగడ్డను కంట్రోల్ తప్పేలా చేయాలన్న వ్యూహాన్ని వైసీపీ పెద్దలు అనుసరిస్తున్నట్లుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే కావాలని ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం… ప్రకటనలకు సంబంధించి ఎస్ఈసీ అనుమతి తీసుకోవాలి. పైగా ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు చేస్తూ కూడా ఎస్ఈసీ పర్మిషన్ తీసుకోలేదు. అలాగే ఏకగ్రీవాలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు . ఎస్ఈసీ నిర్ణయాలను తప్పు పడుతున్నారు. వారు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంగిస్తున్నారని.. కోడ్ను ఉల్లంఘిస్తున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నా పట్టించుకోవడం లేదు.
ఎస్ఈసీపై తీవ్రమైన విమర్శలు చేయడం ద్వారా.. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం చేయడం ద్వారా.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు లేకపోతే.. నామినేషన్లు వేయకుండా… గతంలో చేసినట్లుగా చేస్తే అడ్డుకోకుండా చూసుకోవచ్చన్న వ్యూహంతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా భావిస్తున్నారు. బలవంత ఏకగ్రీవాలను అడ్డుకుంటే… టీడీపీకి సాయం చేసినట్లేనని.. చంద్రబాబు చెప్పినట్లే చేస్తున్నారని అదే పనిగా ప్రచారం చేస్తే.. ఆయన అడ్డుకోరని.. సైలెంట్ గా ఉండిపోతారని వైసీపీ నేతలు భావిస్తున్నారని అంచనా వేస్తున్నారు. అందుకే.. ఎస్ఈసీపై విమర్శల దాడి ప్రారంభించారని టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.
అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు వారి విమర్శల్ని… మనసులో పెట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. నిబంధనల ప్రకారం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందో.. ఆ దిశగా అడుగులేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించారని.. కోడ్ ఉల్లంఘించారని నేరుగా ప్రకటించారు. తదుపరి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నాం కాబట్టి.. ఏం చేసినా చెల్లుబాటవుతుందన్నట్లుగా అధికార పార్టీ నేతలు ఉన్నారని.. కానీ ఇప్పుడు వారు వ్యవహరిస్తున్న ప్రభావం.. తర్వాత కూడా ఉంటుందని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి.