మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుందని సామెత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇది ప్రత్యక్షంగా తెలిసి వస్తోంది. ప్రతిపక్షం ఉనికి 20 ఎమ్మెల్యే సీట్లకు అటూ ఇటూగా ఉండటం…. వారిలో చాలా మందిని వ్యాపారాలు.. ఇతర ఒత్తిళ్లకు గురి చేసి సైలెంట్‌గా ఉంచడంతో వైసీపీకి ప్రజాప్రతినిధుల పరంగా తిరుగు లేకుండా పోయింది. దీంతో ఇక వైసీపీ ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోవడం మానేసింది హైకమాండ్. వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. కనీసం రిపబ్లిక్ డే వేడుకల్లో అధికారికంగా పాల్గొనే అవకాశాన్ని కూడా అధికారులు కల్పించలేదు. సీనియర్‌గా మంత్రి ఆనం తనకు అగౌరవం జరిగిందని బాధపడిపోయి మీడియా ముందుకు వచ్చారు కానీ… ఇతరులు రాలేకపోతున్నారు. ఆనం బయటకు రావడానికి ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయి… ఇతరులకు అలాంటివి లేవు. వచ్చినప్పుడు బయటకు వస్తారు.
మంది ఎక్కువ… మజ్జిగ పలుచన..!
ఎమ్మెల్యేలను హైకమాండ్ పట్టించుకోవడం లేదు. నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు చేస్తున్న విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలవుతున్నాయి. గ్రామాల్లో రోడ్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం కావడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే కొన్ని పనులను మాత్రం అతి కష్టం మీద.. పార్టీకి పని చేసిన వారికి కేటాయిస్తున్నారు. కానీ… ఆశించేవారుఎక్కువగా ఉండటంతో సమస్యలు వస్తున్నాయి. అనుచతరులకు సర్ది చెప్పలేక సతమతమవుతున్నారు. నిధులతో సంబంధం లేదని పనులు.. సన్నిహిత అధికారుల పోస్టింగ్‌ల విషయంలోనూ.. వారికి ఇబ్బందులే. చెప్పుకుందామంటే.. ఎవరూ అందుబాటులో ఉండని పరిస్థితి.
కనీసం కార్యకర్తలకు సీఎంఆర్ఎఫ్ సాయం చేయలేని దుస్థితి..!
సీఎంఆర్ఎఫ్ నిధులూ ఇప్పుడు మంజూరు చేయకపోతూండటంతో ఎమ్మెల్యేలకు తలవంపులుగా మారింది. ఏడాది నుంచి ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్ నిధులు ఇవ్వడం లేదని.. తానెక్కడి నుంచి తేవాలని ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి… తన వద్దకు వైద్యసాయం కోసం వచ్చిన ఓ వ్యక్తికి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈయన సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు. కొత్త కొత్త కార్లు.. నేమ్ ప్లేట్ లేని అత్యాధునిక కార్లలో ఫోటో షూట్ల మాదిరిగా వచ్చి వీడియోలు చేయించుకుని ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ నియోజకవర్గంలోని పేదలకే సీఎంఆర్ఎఫ్ అందడం లేదు. కొన్ని వేల దరఖాస్తులు సీఎంఆర్ఎఫ్లో పెండింగ్‌లో ఉండిపోయాయి. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ సాయం కోసమే ఎమ్మెల్యేల వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తూంటారు. వారికి సాయం చేయలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు పడిపోయారు.
కలిసి బాధలు చెప్పుకుందామన్నా.. వినేవారు లేరు..!
ఓ వైపు ముఖ్యమంత్రి సమయం ఇవ్వరు. గతంలో చెప్పుకుందామంటే.. కనీసం విజయసాయి, సజ్జల లాంటి వాళ్లయినా అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు సజ్జల కూడా సీఎంతో పాటే బిజీగా ఉంటున్నారు. విజయసాయి ఉత్తరాంధ్రకే పరిమితమైనా… అక్కడి ఎమ్మెల్యేలు కూడా సజ్జల వైపే చూడాల్సిన పరిస్థితి. అభివృద్ధి నిధులు రావు.. పార్టీ కార్యకర్తలకు పనులు చేయలేని పరిస్థితి. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు అన్నింటిని మౌనంగా భరిస్తున్నారు. ఆనం లాంటి వాళ్లు మరికొంత మంది అయినా బయటకు వస్తేనే… హైకమాండ్ వారి సమస్యలపై దృష్టి సారించే అవకాశం ఉంది.