ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆఫీసులో కూర్చుని మాత్రమే ఎన్నికలు నిర్వహించాలనుకోవడం లేదు. ఆయన ఇంకా అడ్వాన్స్‌గా ఆలోచిస్తున్నారు. జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేస్తారు. ఆ తర్వాత ఆయన జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ముఖ్యంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ఆయన దృష్టి పెట్టారు. మొదటగా రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో, శనివారం కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. బలవంతపు ఏకగ్రీవాలు జరగకూడదని ఆయన భావిస్తున్నారు.
అందుకే సంజయ్ అనే ఐజీ స్థాయి అధికారిని ప్రత్యేక పర్యవేక్షణకు కూడా నియమించారు. ఇప్పుడు నేరుగా ఆయన క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్తూండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఎస్ఈసీలుగా పని చేసిన వారు ఎన్నికల సమయంలో జిల్లాలు తిరిగిన సందర్భాలు పెద్దగాలేవు. నిమ్మగడ్డ కూడా… వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో జిల్లాలు పర్యటించాలన్న ఆలోనచ కూడా పెట్టుకోలేదు. బలవంతపు ఏకగ్రీవాలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం తనను తొలగించినా న్యాయపోరాటం చేసి.. పదవి సాధించుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో నిష్ఫాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే… అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో వారిలో కాస్త జాగ్రత్త కల్పించడానికి జిల్లాల పర్యనటకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నిమ్మగడ్డపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విపక్ష నేతలు.. జిల్లాల పర్యటనను మరింత ఘాటుగా ఖండించే అవకాశం ఉంది.