ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మీడియాపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. తమకు వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే చానళ్లపై వేటు వేసింది. కొత్తగా ఫైబర్ నెట్ చైర్మన్ అయిన గౌతం రెడ్డి ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని అన్ని జిల్లాల కేబుల్ ఆపరేటర్లను పిలిచి.. ఏబీఎన్‌తో పాటు టీవీ5ని నిలిపివేస్తారా… స్తంభాలపై ఉన్న మీ కేబుళ్లను కట్ చేయమంటారా అని సింగిల్ ఆప్షన్ ఇచ్చారు. కొంత మంది కేబుల్ ఆపరేటర్లు అభ్యంతరాలు చెప్పినా.. అది సీఎం జగన్ ఆర్డర్ అంటూ వీటో చేసి.. మరో ప్రతిపాదన లేకుండా పంపేశారు. అసలేదీ లేకపోవడం కన్నా ఏదో ఒకటి ఉండటం మంచిదనుకున్న కేబుల్ ఆపరేటర్లు ఏబీఎన్, టీవీ5లను నిలిపివేశారు.
పంచాయతీ ఎన్నికల సమయంలో ఒక్క వైపే వార్తలు తెలుస్తూండటంతో ప్రేక్షకులు కూడా అంత సంతృప్తిగా లేరు. టీడీపీ నేతలతో పాటు ఇతర విపక్ష నేతలు… ఏపీలో మీడియాపై ఆంక్షలను ఖండిస్తున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కేబుల్ ఆపరేటర్లు ఇచ్చిన కనెక్షన్లలో రెండు చానళ్లు రావడం లేదు. డీటీహెచ్ ఉన్న వారికి మాత్రమే ఏబీఎన్ వస్తోంది. అది కూడా లేని వాళ్లు యూట్యూబ్ లైవ్ ను ఆశ్రయిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల వ్యవహారంపై అనేకానేక వివాదాస్పద అంశాలు తెరపైకి వచ్చాయి. వాటిని ప్రజల్లోకి వెళ్లకుండా.. ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్లుగా ఉంది.
గతంలోనూ ఇలాగే బ్యాన్ చేయడంతో రెండు చానళ్లు ఢిల్లీ స్థాయిలో రెగ్యులేటరీ సంస్థల దగ్గర న్యాయపోరాటం చేసి ఎలాగోలా మళ్లీ ప్రసారాలను పునరుద్ధరించుకున్నాయి. ఇప్పుడు.. మళ్లీ అలాంటి ప్రయత్నాలే చేసుకోవాల్సి ఉంది. కానీ అలా చేసుకుని వచ్చే సరికి పుణ్యకాలం గడిచిపోతుంది. స్థానిక ఎన్నికలు.. తిరుపతి ఉపఎన్నికలు ముగిసిపోయే అవకాశం ఉంది. మీడియాను చూసి ఎందుకంత భయపడుతున్నారని అధికార పార్టీని విపక్ష పార్టీలు విమర్శించడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి.