ఎస్ఈసీ రమేష్ కుమార్ అభిశంసనకు గురైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్‌లను ఆ ఉపద్రవం నుంచి తప్పించడానికి ప్రభుత్వం కిందా మీదా పడుతోంది. తాము ఎస్ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను తిరస్కరించామని మంత్రి పెద్దిరడ్డి లాంటి వాళ్లు చెప్పినా… ప్రభుత్వంలో కంగారు తగ్గలేదు. చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కూడా.. ఆ ప్రొసీడింగ్స్‌ను ఎస్ఈసీకి తిరిగి పంపారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ఉత్తర్వులను ఎస్ఈసీ నిమ్మగడ్డ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖలో.. సివిల్ సర్వీస్ అధికారుల వ్యవహారాలు చూసే డీవోపీటీకి కూడా పంపడంతో ప్రభుత్వం వెనక్కి పంపితే సరిపోదని.. అక్కడ సర్వీస్ రికార్డుల్లో నమోదు కాకుండా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఆలస్యం చేయకుండా… చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్.. డీవోపీటీకి లేఖరాశారు. ఏపీ ఎస్ఈసీ తీసుకున్న చర్యలు తీవ్ర అభ్యంతరకరమని .. కేంద్ర పరిధిలోని అధికారులపై ఎస్ఈసీకి చర్యలు తీసుకునే అధికారం లేదని లేఖలో ఆదిత్యనాథ్ దాస్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అభిశంసన ఉత్తర్వులు ఉంటాయని, కానీ పరిధిలో లేని న్యాయ, చట్ట విరుద్ధమైన ఉత్తర్వులను ఐఏఎస్ అధికారులపై ఏపీ ఎస్ఈసీ తీసుకున్నారని ఏపీ సీఎస్ లేఖలో వివరించారు. ఇలాంటి చర్యలు తీసుకోవటం న్యాయ విరుద్ధమన్నారు. అభిశంసన ఉత్తర్వులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని, ఎస్ఈసీ పంపిన అభిశంసన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవద్దని చివరిగా కోరారు.
ఈ విషంయలో ఎస్ఈసీకి సూచనలు, మార్గదర్శనం చేయాలని డీవోపీటీని ఏపీ సీఎస్ కోరారు. దీనిపై డీవోపీటీ స్పందనపైనే ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారుల భవిష్యత్ ఆధారపడి ఉంది. ఒక వేళ వారి సర్వీస్ రికార్డుల్లో అది నమోదైతే.. వారికి ఇక ముందు ప్రమోషన్లు రావడం అంత తేలిక కాదని చెబుతున్నారు. అందుకే… వారిని కాపాడకపోతే.. ఇతర సివిల్ సర్వీస్ అధికారులు.. తమ మాట వినరని.. ఆందోళన చెందుతున్నారు.