విజయనగరం జిల్లాలో చంద్రబాబు రామతీర్థం పర్యటన తర్వాత … ఆ పార్టీని.. పార్టీ నేతల్ని ఏదో ఒకటి చేయాలన్న కసితో ఉన్న ప్రభుత్వం.. విజయసాయిరెడ్డి కారుపై వాటర్ బాటిళ్లు పడ్డాయన్న కారణంతో చంద్రబాబు, అచ్చెన్న, కళా వెంకట్రావులపై హత్యాయత్నం కేసులు పెట్టేసింది. అదే రోజు… అశోక్ గజపతిరాజును … రామతీర్థం ఆలయం అనువంశిక ధర్మకర్త హోదా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చేసింది. అలా తొలగించడం చట్ట బద్ధం కాదని.. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని.. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఆ ఉత్తర్వులు న్యాయస్థానంలో నిలవబోవని అప్పుడే టీడీపీ నేతలు చెప్పారు. ఈ అంశంపై అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు.
విచారణ జరిపిన హైకోర్టు రామతీర్థం అనువంశిక ధర్మకర్తగా అశోక్‌గజపతిరాజు తొలగింపు ఆదేశాలు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. దీంతో అశోక్ గజపతిరాజు మళ్లీ అనువంశిక ధర్మకర్తగా కొనసాగుతారు. మరోసారి రాముడికి సేవ చేసే భాగ్యం కలిగిందని సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో జీవోలు..నిర్ణయాలను హైకోర్టు కొట్టి వేసింది. అయితే.. అప్పటికప్పుడు.. కొంత మందిపై చర్యలు తీసుకోవడం తమ అహన్ని ప్రభుత్వ పెద్దలు చల్లార్చుకుంటున్నారని… తర్వాత కోర్టుల్లో నిలవవు అని తెలిసినా… ముందుకే వెళ్తున్నారని అంటున్నారు.
అశోక్ గజపతిరాజు అనువంశిక ధర్మకర్త హోదాను ప్రభుత్వం మళ్లీ తొలగించాలనుంటే.. మరో మార్గం ద్వారా ప్రయత్నిస్తుంది. అది చట్టబద్ధమా కాదా అన్న సంగతి తర్వాత. కోర్టులో తేలే వరకూ.. ఆయనను ఆ పదవి నుంచి దూరంగా ఉంచొచ్చనేది ప్రభుత్వ వ్యూహం. మొత్తానికి ఇప్పటికైతే అశోక్ గజపతిరాజు పైచేయి సాధించారు.