ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తకష్టం వచ్చింది. చంద్రబాబు హయాంలో కీలకంగా ఉన్నారనో… నచ్చని సామాజికవర్గానికి చెందినవారనో కానీ.. చాలా మందిని దూరంగా ఉంచారు. పోస్టింగ్‌లు లేవు. ఇప్పుడు వారందరికీ అర్జంట్‌గా పోస్టింగ్‌లు ఇచ్చేస్తున్నారు. ప్రమోషన్లు కూడా ఇచ్చేస్తున్నారు. దీనికి కారణం వారందర్నీ ఎస్ఈసీ విధుల్లోకి తీసుకుని ఎన్నికల పనులు చెబుతారోనన్న భయమే. తాజాగా రవిచంద్ర అనే ఐఏఎస్ అధికారి ఖాళీగా ఉన్నారు. ఎస్ఈసీ కార్యదర్శిగా ఉన్న వాణిమోహన్ పని చేయడానికి సంశయిస్తూండటంతో ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆమె స్థానంలో మరొకర్ని నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఖాళీగా ఉన్న ఐఏఎస్‌లలో ఒకరైన రవిచంద్రను ఎస్ఈసీ కార్యదర్శిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించారు. ఆయన ఉత్తర్వుల్లో కూడా అదే పేర్కొన్నారు. ఖాళీగా ఉన్నారని నియమించానని స్పష్టం చేశారు.
అయితే రవిచంద్ర ఎస్ఈసీ కార్యదర్శిగా వెళ్తే తమకు ఇబ్బందులు వస్తాయని అధికారపక్షం అనుకుందో లేకపోతే… ఎస్ఈసీ కోరుకున్న వారిని ఇవ్వకూడదని అనుకుందో కానీ.. వెంటనే… రవిచంద్రకు టీకా పోస్టింగ్ ఇచ్చింది. టీకా వ్యవహారాలను పర్యవేక్షించే పోస్ట్ ఇచ్చింది. నిజానికి ఆ పోస్టు లేదు. కానీ సృష్టించి మరీ పోస్టింగ్ ఇచ్చారు. ఇంత కాలం ఖాళీగా పెట్టిన అధికారికి… ఒక్కసారే రెండు పోస్టులొచ్చాయన్నమాట. రవిచంద్రను అలా నియమించి.. మీకు కావాలంటే… వీరిలో నుంచి తీసుకోండి అంటూ ముగ్గురు పేర్లను పంపింది.
ఒక్క రవిచంద్ర విషయంలోనే కాదు… మాజీ డీజీపీ ఆర్పీఠాకూర్‌కు మంచి పోస్టింగ్ రావడానికి … ఐజీ సంజయ్‌కు ఇంత కాలం ఆగిన ప్రమోషన్ వెంటనే రావడానికి కూడా పంచాయతీ ఎన్నికలే కారణమని అధికార వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరికొంత మంది ఖాళీగా ఉన్నఅధికారులకు పోస్టింగ్‌లు ఇస్తోంది. వారంతా వివిధ సమీరణాల రీత్యా ప్రతిపక్షానికి సన్నిహితులని అధికార పార్టీ భావన. ఇప్పుడు వారి ఎన్నికల విధుల్లోకి వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుమానిస్తున్నారు. అందుకే పోస్టింగ్‌లు ఇచ్చేస్తున్నారు. ఎన్నికలు ఈ విధంగా అయినా మేలు చేస్తున్నాయని కొంత మంది అధికారులు సంతోషపడుతున్నారు.