పిఆర్సీ నివేదిక, ఉద్యోగ సంఘాల ఆందోళనలపై తెలంగాణలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఉద్యోగుల ఫిట్మెంట్పై ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఫాంహౌస్ నుంచి రాగానే ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాల ప్రకారం… చూస్తే ప్రతిపాదనలకంటే మూడు నాలుగు రెట్లపైనే ఫిట్మెంట్ ఉండబోతోందంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆశతో ఉన్నారు.అందుకే పీఆర్సీ నివేదిక బయటకు రాగానే ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేసినా.. ఎక్కడా కేసీఆర్పై విమర్శల జోలికి వెళ్లలేదు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాల నేతలకు అధికార పార్టీ నేతల నుంచి సమాచారం అందించారని చెబుతున్నారు.
ఈ నెలాఖరులోగా ఉద్యోగులను సంతృప్తి పరిచేలా ఫిట్మెంట్ ప్రకటిస్తారని సమాచారం. ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇక ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులోగా ఇతర సమస్యలను పరిష్కరించి అందరినీ సంతృప్తి పరిచే విధంగా నిర్ణయాలు ప్రకటిచేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అయినట్లు సమాచారం. ఇదే జరిగితే కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసేందుకు కూడా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ కూడా పాలాభిషేకాల కోసమే కొత్త నాటకాలని విమర్శిస్తున్నారు.
రేపోమాపో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. అలాగే నిరుద్యోగ భృతిని కూడా కేసీఆర్ ప్రకటిస్తారని కేటిఆర్ చెప్పారు. త్వరలో కేటీఆర్కు పట్టాభిషేకం జరగబోతోందనే ప్రచారం మధ్య అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నాల్లో కేసీఆర్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కానీ.. సీఎస్ సోమేష్ కుమార్ మాత్రం… ఆర్థిక పరిస్థితిని ..తనను కలుస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు వివరిస్తున్నారు. ఇప్పటికి ఇంతే అని చెబుతున్నారు. ఒక వేళ కేసీఆర్ ఈ సారి ఉద్యోగులకు షాకివ్వాలనుకుంటే… అంతే ఉంటుంది. అందుకే ఉద్యోగ సంఘ నేతలు కొంత టెన్షన్ పడుతున్నారు.