ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని… అది ఎన్నికల కమిషన్ పరిధిలోనిదంటూ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు షాకిచ్చింది. అది ఏసీబీ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో రేవంత్ రెడ్డితో పాటు ఇతర నిందితులపై అభియోగాలను నమోదు చేయడానికి మార్గం సుగమం అయింది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుంచి అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ రోజు నిందితులందరూ హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్న స్టీఫెన్సన్కు.. రూ.50లక్షలు ఇస్తూ.. రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. పక్కాగా ట్రాప్ చేసి.. కనీసం పది కెమెరాలు చుట్టుపక్కల పెట్టి పోలీసులు రేవంత్ ను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన తన ఓటును టీడీపీ అభ్యర్థికి మద్దతుగా వేయాలని బేరం కుదుర్చుకున్నారు. ఈ కేసు అసలు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదని రేవంత్ వాదిస్తున్నారు. ఓటు కొనుగోలు అనేది ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని చెబుతూ వస్తున్నారు. ఎన్నికల సంఘం పరిధిలోకి ఆ కేసు వస్తే.. పెట్టీ కేసు అవుతుంది.
ఏసీబీ కేసు అయితే.. కాస్త తీవ్రమైన కేసు అవుతుంది. అందుకే.. ఆయన ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని చెప్పడం ప్రారంభించారు. కానీ.. ఏసీబీ కోర్టు మాత్రం ఏసీబీ పరిధిలోకి వస్తుందని తేల్చేసింది. దీనిపై రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేస్తారో లేదో క్లారిటీ లేదు. కానీ వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి అభియోగాల నమోదు మాత్రం ప్రారంభమవుతుంది.