బీఫ్ ఫెస్టివల్ విషయంలో ప్రజల్ని రెచ్చగొట్టేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. వివాదాస్పద ప్రకటనకు కేరాఫ్ అడ్రస్ అయిన రాజాసింగ్ చేసిన అనేకానేక కేసు పెట్టగలిగిన వ్యాఖ్యల్లో… బీఫ్ ఫెస్టివల్‌పై చేసిన వ్యాఖ్యలు ఒకటి. ఇప్పటికీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అయితే శిక్ష పడుతుందని రాజాసింగ్ కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే… తాను చాలా సందర్భాల్లో అంత కన్నా ఘాటు వ్యాఖ్యలే మాట్లాడానని ఆయనకుతెలుసు. ఇప్పుడు పైకోర్టులోఅప్పీల్ చేసుకునేందుకు కింది కోర్టు నెల గడువు ఇచ్చినా… హైకోర్టులో ఊరట వచ్చినా… శిక్ష మాత్రం పడినట్లే.
ఒక వేళ హైకోర్టు శిక్ష ఖరారు చేసినా రాజాసింగ్‌కు రాజకీయంగా వచ్చే నష్టం ఉండదు. ఆయనపై అనర్హతా వేటు పడదు. చట్టం ప్రకారం…రెండేళ్ల జైలు శిక్షపడితేనే ప్రజాప్రతినిధిపై అనర్హతా వేటు పడుతుంది. కానీ రాజాసింగ్‌పై వచ్చిన తీర్పు రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశం కావడం ఖాయం. ప్రజల్ని రెచ్చగొట్టేలా చేసే రాజకీయాల్లో ఈ మాటలదే కీలకం. ఇటీవల ఓ బీజేపీ నేత తిరుపతి ఉపఎన్నికలను కృష్ణుడు, ఏసుకు మధ్య పోటీగా అభివర్ణించారు. మామూలుగా అయితే ఇది రాజ్యాంగాన్ని ఘోరంగా అవమానించినంత నేరం. కానీ వారు దేశంలోని అధికార పార్టీ వారు.. వారి రాజకీయ విధానమే ఆ కోణంలో ఉంటుంది కాబట్టి… ఎవరూకేసుల వరకూ వెళ్లలేదు.
కానీ విద్వేష రాజకీయాలను కూకటివేళ్లతో పెకిలించాలంటే.. రాజాసింగ్‌కు విధించిన శిక్షతరహాలోనే అన్ని రాజకీయ పార్టీల నేతలకు వేయాలి. ప్రజాసమస్యలు మాత్రమే ఎన్నికల్లో చర్చనీయాంశం కావాలి కానీ.. కులం, మతం కాకుండా ఉండాలి. అలాంటి పరిస్థితి వస్తుందో లేదో చెప్పలేం కానీ… శిక్ష పడిన రాజాసింగ్‌లో కొంత మార్పు వచ్చినా ఆశలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.