విశాలమైన భవనాలు… అతి పెద్ద ప్లే గ్రౌండ్… ఆహ్లాదంగా ఉండే రంగులు… అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్. ఇలాంటి సౌకర్యాలు ఉంటే అది ఇంటర్నేషనల్ స్కూల్ అని .. లక్షల్లో ఫీజులు కట్టుకోవాలని తల్లిదండ్రులకు ఓ అభిప్రాయం ఉంది. అది నిజం కూడా . కానీ కార్పొరేట్ స్కూల్సే కాదు.. ప్రభుత్వ బడులు కూడా అలా తయారవ్వగలవు అని.. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసి చూపిస్తున్నారు. సిరిసిల్లలోని ప్రభుత్వ బడి..ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్స్‌కు తగ్గనిరీతిలో రెడీ అయింది.
తెలంగాణలో స్కూళ్లను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు. సిరిసిల్ల గీతా నగర్లో స్కూల్ కూడా ఈ రోజే ప్రారంభమవుతుంది. అక్కడ చదువుకునే పిల్లలు.. గతంలో తమ బడికి.. ఇప్పటి బడికి స్పష్టమైన తేడా చూడబోతున్నారు. వెయ్యి మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఉన్న ఈ స్కూళ్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అనారోగ్యం బారిన పడిన విద్యార్థుల కోసం ఓ సిక్ రూమ్, అన్ని పుస్తకాలతో ఉన్న లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, డైనింగ్ హాల్, 11 సీసీటీవీ కెమెరాలు, వైఫై సదుపాయం, ఫుట్‌బాల్ కోర్టును ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో ఉన్న అన్ని పాఠశాలలను ఇలా మార్చడమే తన లక్ష్యమన్నారు.
అయితే ప్రభుత్వ నిధులతో సొంత నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటున్నారని కొంత మంది విమర్శిస్తూ ఉంటారు కానీ.. ఈ బడికి ప్రభుత్వ నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మొత్తం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ కంపెనీలు.. విరాళాలు ఇచ్చి.. ఈ పనులు చేయించాయి. ఈ విషయంలో కేటీఆర్ మరింత చురుకుగా ఉంటారు. గంతలోనూ.. ఓ ప్రభుత్వ బడికి రైలు ఆకారంలో పెయింటింగ్‌తో పాటు ఇతర హంగులు సమకూర్చారు. తన ట్విట్టర్లో ఆ స్కూల్ ఫోటోలు పెట్టారు. సీఎస్ఆర్ నిధుల సాయంతో బడికి కొత్త రూపు వచ్చిందని.. సంతోషం వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో బీజేపీ నేతలు కేంద్ర నిధులతో ఈ బడికి రూపుమార్చాం అని ప్రచారం చేసుకున్నారు..అది వేరే విషయం…!