మనసు బాలేదు..
మానసిక ఒత్తిడి..
సరదాగా రెండు గంటల సినిమా చూసి, రిలాక్సయిపోదాం.
అంత టైమ్ లేదా?
`బ్రహ్మానందం ఫొటో చూసేద్దాం`
– చాలు.. బోలెడంత రిలీఫ్.. బక్కెట్టెడు బూస్టు, నూతెడు హార్లిక్సూ..!
అదీ.. బ్రహ్మానందం అంటే!
స్ట్రస్ బ్లస్టర్ అంటారే… ఆ విషయంఓ బ్రహ్మానందాన్ని మించింది లేదు. రాదు. ఇది నవ్వంత నిజం.
నాగార్జున సెల్ ఫోన్ లో.. బ్రహ్మానందం కోతి మెహం వేసుకున్న ఓ ఫొటో ఉంటుంది. నాగ్ కి ఎప్పుడు కోపం వచ్చినా.. సెల్ ఫోన్ తీసి ఆ ఫొటో చూసుకుంటారట. అంతే.. కోపం అన్నపూర్ణ గేటు దూకి పారిపోతుంది. బ్రహ్మానందం అంటే అదీ!
కొంతమంది నవ్వించాలంటే కష్టపడి ఓ జోక్ చెప్పాలి.
లేదంటే.. తింగరి తింగరి వేషాలేయాలి.
బ్రహ్మానందం ఇవి రెండూ చేయడు. ఓ విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. కొన్నిసార్లు టైమ్ వేస్టని అదీ ఇవ్వడు. కానీ… నవ్వేస్తాం. పడీ పడీ నవ్వేస్తాం. గుర్తు తెచ్చుకుని మరీ.. పగలబడిపోతాం. ఇదంతా బ్రహ్మీ చేసే మ్యాజిక్కు.
ఫేస్ బుక్ చూస్తుంటాం. అందులో బోల్డంత చెత్త కూడా ఉంటుంది. ఓచోట.. కాసేపాగి స్మైల్ ఇచ్చారంటే… అక్కడ బ్రహ్మానందం మీమ్ ఏదో ఉందన్నమాట.
ఏ మీమ్ పేజీ తీసుకున్నా.. బ్రహ్మీ కనిపిస్తాడు.
ఊహూ.. మీమ్ అంటేనే బ్రహ్మానందం. మీమ్ పేజీలకు ఆయన దేవుడంతే.
`బైది గాడ్ గ్రేస్ ఇప్పటి వరకూ నాకు కొత్త ట్యూన్ చేసే అవసరం రాలేదు` అంటూ కింగ్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ పెట్టేస్తే చాలు.ఆ డైలాగ్ ఎవరికైనా అన్వచించుకోవొచ్చు.
`ఏవండీ నాగార్జున గారూ..` అని అమాయకంగా కెమెరా వంక చూస్తూ చెప్పే డైలాగ్ కట్ చేస్తే చాలు.. ఎక్కడైనా బోలెడు నవ్వులు పూయించుకోవొచ్చు.
బ్రహ్మానందం ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించేశాడు గానీ, మనం బాగా నవ్వుకోవడానికీ, కావల్సినన్ని క్యాలరీలు ఖర్చు చేసుకోవడానికీ… బ్రహ్మానందం పాత సినిమాలు, చేసిన పాత్రలు గుర్తు చేసుకుంటే చాలు.
అవే.. మరో వందేళ్ల ఆయువు పోస్తాయి.
మరింత ఆరోగ్యాన్ని అందిస్తాయి.
ఇన్ని నవ్వులు పంచిన.. పంచుతున్న బ్రహ్మానందం కూడా.. వందేళ్లూ వర్థిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్తడే… బ్రహ్మానందం గారూ…