న్యాయమూర్తుల్ని దూషించిన కేసులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6న సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో డాక్టర్ సుధాకర్ ఘటనపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించినప్పుడు ఆమంచి కోర్టులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఆమంచి మాత్రమే కాదు… అంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగినట్లుగా కొంత మంది విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారం మొత్తం వెనుక ఓ గూడుపుఠాణి ఉందని భావించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇచ్చిన గడువు లోపు సీబీఐ అధికారులు విచారణ జరపలేకపోయారు. విదేశాల్లో ఉన్న వారిపైనా దర్యాప్తు చేయాల్సి ఉన్నందున సమయం కావాలని కోరింది. దాంతో హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు సీబీఐ అధికారులు మెల్లగా విచారణలో వేగం పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది.
అమంచి కృష్ణమోహన్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పదవిలో ఉన్న పలువురిని కూడా సీబీఐ ప్రశ్నిస్తుందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలపై కూడా గతంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వారి వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను సీబీఐ అడిగినప్పుడు అందించాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వివరాలను పరిశీలించి… తీవ్ర నేరాలకు పాల్పడినట్లు తేలితే సీబీఐ మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని, వాటిపై దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని ఆదేశించింది. దీంతో వారికి కూడా… సీబీఐ నోటీసులు జారీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
తీర్పులు అనుకూలంగా రాకపోతే న్యాయవ్యవస్థను ఎవరో మేనేజ్ చేస్తున్నారని ఆరోపించడం… న్యాయమూర్తులపై దాడులు చేయడం కొంత కాలంగా ఏపీలో జరుగుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్‌పై ఆరోపణలు చేస్తూ లేఖను సీజేఐకి పంపడమే కాదు.. మీడియాకు కూడా విడుదల చేశారు. ఇప్పుడు సీబీఐ గతంలో వివాదాలన్నింటినీ వెలికి తీసి.. ఈ పోస్టింగుల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందో లేదోతేల్చే పనిలో పడింది.