వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి క్రీస్టియన్ కనుక ఆ మతస్తులు వైకాపా వైపు ఆకర్షింపబడితే అసహజమేమీ కాదు. అయితే జగన్ ఏనాడూ క్రీస్టియన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వ్యవహరించలేదు కానీ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలయిన విజయమ్మ చేతిలో బైబిల్ పుస్తకం పట్టుకొని సభలకు, సమావేశాలకు హాజరవుతుండటం వలన తమ పార్టీ క్రీస్టియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చాటుకొంటున్నట్లుండేది. అయినప్పటికీ వైకాపాపై మతతత్వ పార్టీగా ముద్రపడలేదు కానీ ఆ పార్టీ రెడ్డి సామాజిక వర్గంతోనే నిండిపోయుండటంతో అది ఆ సామాజిక వర్గానికి ప్రధాన రాజకీయ వేదికగా గుర్తింపు పొందింది.
వైకాపాపై ఎటువంటి మతతత్వ ముద్ర లేకపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలాగా సెక్యులర్ పార్టీగా గుర్తింపు సంపాదించుకోవాలని చాలా కాలంగానే ప్రయత్నిస్తున్నారు. బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన గత ఏడాది విశాఖలోని శారదా పీఠానికి వెళ్లి అక్కడి పీఠాదిపతి స్వామీ స్వరూపానందేంద్ర ఆశీసులు తీసుకొన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి హైందవ సంప్రదాయాల ప్రకారం పిండ ప్రధానం చేసారు. మళ్ళీ నిన్న శారదా పీఠానికి వెళ్లి అక్కడ స్వామి స్వరూపానందేంద్ర అద్వర్యంలో జరిగిన కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముస్లిం మతస్థులను కూడా ఆకట్టుకోవడానికి జగన్ యధాశక్తిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
కాపులను ఆకట్టుకోవడానికి అనేక మంది కాపు నేతలను పార్టీలోకి రప్పించుకోవడమే కాకుండా కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమానికి కూడా మద్దతు ఇచ్చారు. అదే సమయంలో బీసీలకు అన్యాయం జరగకూడదని డిమాండ్ చేయడం ద్వారా ఆ వర్గం ప్రజలు పార్టీకి దూరం కాకుండా కాపాడుకొనే ప్రయత్నం చేసారు.
రాజకీయ పార్టీలన్నీ కూడా ఇదే విధంగా సమాజంలో వివిధ మతాలు, కులాల ప్రజలని ఆకట్టునే ప్రయత్నాలు చేస్తుంటాయి. దేశంలో సెక్యులర్ పార్టీగా పేరొందిన కాంగ్రెస్ కూడా వివిధ మతస్తులు, కులస్తులను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తుంటుంది కానీ ఆ ప్రయత్నాల వలన కంటే, అది అవలంభిస్తున్న సెక్యులర్ విధానాల వలననే దానికి ఆ ముద్ర సాధ్యం అయ్యింది. దేశంలోని మిగిలిన జాతీయ, ప్రాంతీయ పార్టీలలో ఏదో ఒక మతం లేదా వర్గానికి చెందినవారు మాత్రమే ఇమడగలరు కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఏ మతస్తుడు, కులస్తుడు, ఏ ప్రాంతానికి చెందినవాడయినా సరే చాలా సులభంగా ఇమిడిపోగలరనే భావన ప్రజలలో, నేతలలో నెలకొని ఉన్నందునే అది సెక్యులర్ పార్టీగా నిలిచిపోయింది. కనుక వైకాపాతో సహా దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా స్వాములు, ముల్లాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కంటే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను అవలంభిస్తే ఆ పార్టీలాగే శాస్వితమయిన సెక్యులర్ ముద్ర సంపాదించుకోవచ్చును.