వైసీపీ ఎంపీలు ఇప్పుడేం చేస్తారు..? ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సైలెంటయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్‌లోనూ ఏపీకి మొండి చేయి చూపారు. కనీస కేటాయింపులు లేవు. ప్రత్యేకహోదా ఊసు అసలే లేదు. గత బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు బాగుందని పొగిడిన వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం… కేంద్రం దగా చేసిందని అంటున్నారు. ఎన్నికలున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అంటే ఆయనకు కూడా ఈ బడ్జెట్ నచ్చలేదు. మరి ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ఎందుకంటే.. రాజ్యసభలో వైసీపీ ఎంపీల మద్దతు బీజేపీకి కీలకం. అదే సమయంలో… లోక్‌సభలో టాప్ ఫైవ్ పార్టీల్లో ఒకటి వైసీపీ. ప్రతిపక్ష పార్టీల్లో ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీల్లో ఒకటి., ఇలాంటి పార్టీ ఎదురుతిరిగితే… కేంద్రంలో కొంత అయినా కదలిక వస్తుందన్న అంచనాలున్నాయి. వైసీపీ కూడా బడ్జెట్‌పై అసంతృప్తిగా ఉండటం… విజయసాయిరెడ్డి హోదా కోసం తిరుగులేని పోరాటం చేస్తామని చెబుతూండటంతో … కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ఏదో ఓ ప్రయత్నం చేస్తుందన్న భావన రాజకీయాల్లో ఏర్పడుతోంది.
ఏపీకి కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా అడగలేని పరిస్థితుల్లో వైసీపీ పడిపోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడకుండా వైసీపీ ఎంపీలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇందు కోసం…. పార్లమెంట్ సమావేశాల్లో భిన్నమైన వ్యూహాన్ని అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆ ప్లాన్ ఏమిటన్నది ముందు ముందు బయటకు వచ్చే అవకాశం ఉంది. 22 మంది ఎంపీలతో రాష్ట్రానికి న్యాయం కోసం పోరాడితే ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని… లేకపోతే ఇబ్బందిపడతామని వైసీపీ క్యాడర్ కూడా భావిస్తోంది.