ఎన్నికలున్న రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు భారీగా చేసిన కేంద్రం… ఇతర మెట్రో నగరాలు ఉన్న రాష్ట్రాలను పట్టించుకోలేదు. తెలంగాణ పరిస్థితి అంతే అయింది. హైదరాబాద్ మెట్రో రెండో దశపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణ సర్కార్‌కు గట్టి షాక్ తగిలింది. చెన్నై మెట్రో ఫేజ్-2కు 63 వేల కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ. 15వేల కోట్లు కేటాయించింది. కొచ్చి మెట్రో రెండో దశకు కూడా నిధులు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. కానీ ఈ జాబితాలో హైదరాబాద్ ఊసు లేదు. మెట్రోను ఎయిర్‌పోర్టు వరకూ విస్తరిస్తామని కేటీఆర్ చాలా సార్లు ప్రకటించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. విభజన చట్టం హామీలు.. తెలంగాణ సర్కార్ కొత్తగా చేపట్టిన అనేక పనులకు నిధులు కొంత అయినా కేటాయిస్తారని ఎదురు చూస్తూ వస్తున్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలు, ఐఐఎం, గిరిజన యూనివర్సిటి వంటి వాటికి చోటు దక్కలేదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కోసం గత టూర్‌లో కేసీఆర్ మోదీకి విజ్ఞప్తి చేసి వచ్చారు. కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. బయ్యారం ఉక్కు ..కాజిపేట వ్యాగన్ ఫ్యాక్టరీ డిమాండ్లుగానే మిగిలిపోనున్నాయి. హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రం కొన్ని కేటాయింపులు .. పెట్టుబడుల ప్రతిపాదనలు చేశారు. వాటి వల్ల ఆయా సంస్థలకు లాభం తప్ప… తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా మిగులు రాష్ట్రంగా తెలంగాణకు ఎలాంటి అదనపు నిధులు రావు. అదే సమయంలో.. పన్నుల వాటాను కేంద్రం ఒక శాతం తగ్గించడంతో పరిస్థితి మరింత దిగజారనుంది.
మొత్తంగా తెలంగాణకు బడ్జెట్‌లో గుండు సున్నా చూపించారని అనుకోవాలి. కానీ… టీఆర్ఎస్ ఎంపీలు సుతిమెత్తని విమర్శలకే పరిమితం అవుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న ఏడాదిలో… మెట్రో రెండో దశకు… ఇతర వాటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశాలు ఉంటాయని… రాజకీయ నేతలు చెబుతున్నారు. బీజేపీతో దూకుడుగా వెళ్లకూడదని అనుకుంటున్న టీఆర్ఎస్ ఈ నిరాదరణపై అధికారికంగా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..!