ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటే వైసీపీ పెద్దలకు మామూలు వ్యతిరేకత ఉండదు. ఆయనను అసెంబ్లీలోనే కులం పేరుతో ప్రస్తావిస్తూంటారు వైసీపీ అధినేత. ఆయన తర్వాత స్టేజ్‌లో ఉన్న విజయసాయిరెడ్డి లాంటి నేతలతే చాలా సార్లు విమర్శించారు కూడా. అయితే… అదే వెంకయ్యనాయుడు .. పొడిగితే మాత్రం విజయసాయిరెడ్డి మురిసిపోతున్నారు. తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. తనను.. తన పనితీరును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పొగిడారని… తన చేతిలోనే ఉన్న వైసీపీ సోషల్ మీడియా వింగ్ ద్వారా విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు.
వెంకయ్యనాయుడు విజయసాయిరెడ్డిని పొగిడింది.. ఆయన ట్వీట్లను చూసి కాదు. ఆయన పనితీరును చూసే. విజయసాయిరెడ్డి కామర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. సాధారణంగా స్టాండింగ్ కమిటీలు అంత యాక్టివ్‌గా ఉండవు. చైర్మన్లు చొరవ తీసుకుంటేనే సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో ఎంత బిజీగా ఉన్నా విజయసాయిరెడ్డి సీరియస్‌గా పని చేశారు. 2019-20లో 15 సార్లు విజయసాయిరెడ్డి చైర్మన్‌గా ఉన్న కామర్స్ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. కొవిడ్ ఉన్నా కూడా ఈ ఏడాది 10 సార్లు సమావేశం అయింది. కరోనా కారణంగా గత ఏడాది ఏప్రిల్-జూలై మధ్య కాలంలో నాలుగు నెలలపాటు అనేక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం సమావేశాలు నిర్వహించారు.
విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కమిటీ అత్యధికంగా 5 నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో కామర్స్ స్టాండింగ్ కమిటీ పనితీరుపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘం కామర్స్ స్టాండింగ్ కమిటీ ఏడాది కాలంలో అత్యత్తమ పని తీరును ప్రదర్శించినట్లు వెంకయ్యనాయుడు ప్రకటించారు. విజయసాయి రెడ్డి నేతృత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. దీనికి విజయసాయిరెడ్డి ఖుషీ అయిపోయారు. ఎంత రాజకీయ నేత అయినా పనితీరుకు ప్రశంస వస్తే.. అది ప్రత్యర్థి ఇచ్చినా.. ఇష్టం లేని సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఇచ్చినా… పాజిటివ్‌గానే స్పందిస్తారు. విజయసాయిరెడ్డి కూడా దానికి అతీతుడు కాదు.