రైతులపై ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నించి విఫలమైన కేంద్రం ఇప్పుడు వారిని ఢిల్లీలోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దాని కోసం ఏం చేస్తుందో చూస్తే.. ఔరా అని నోళ్లు నొక్కుకోక తప్పదు. రహదారులపై అడ్డంగా గోడల నిర్మాణం మాత్రమే కాదు… పెద్ద ఎత్తున ఇనుప ముళ్లను ఏర్పాటు చేస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి సినిమా తరహాలో… ఇనుప ముళ్ల వలయాలను రోడ్డుపై ఏర్పాటు చేశారు. పొరపాటున ఎవరైనా వాటిపై పడితే… శరీరంలోకి కనీసం పది ఇనుప చువ్వలు దిగబడతాయి. ఒక వైపు నుంచి మరో వైపు బయటకు వస్తాయి.
గతంలో పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చి… రిపబ్లిక్ డే ర్యాలీ హింసాత్మకం కావడంతో విరమించుకున్నారు. ఇప్పుడు ఆరో తేదీన మధ్యాహ్నం నుంచి పన్నెండు గంటల పాటు రోడ్ల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. దీంతో సింఘు, టిక్రి సహా ఘాజీపుర్ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రహదారి మధ్యలో కాంక్రీట్ పోతపోసి అందులో పదునైన ఇనుప మేకులు అమర్చారు. మొదట ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన అధికారులు.. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.
రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ ఆందోళన చేస్తోన్న ఘాజీపుర్ సరిహద్దుల్లోకి ఉద్యమానికి మద్దుతుగా రైతుల దండు కదలడంతో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల సాయంతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితి కశ్మీర్ బోర్డర్ లో ఉన్న తరహాలో ఉంది. కంచెలు.. ఇనుప ముళ్లు ఇలా.. రైతుల్ని ఆపడానికి ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. కానీ వారి డిమాండ్‌ను నెరవేర్చడానికి మాత్రం సిద్ధంగా లేరు.