థియేటర్లు తెరచుకోవడం, సంక్రాంతికి థియేటర్ల దగ్గర…. జన సందోహం కనిపించడంతో టాలీవుడ్ కి కిక్ ఇచ్చింది. అంతే కాదు.. 100 శాతం ఆక్యుపెన్సీకి కేంద్రం పచ్చ జెండా ఊపడంతో మరింత బలం వచ్చింది. అందుకే సినిమాలు వరుస పెడుతున్నాయి. ఇన్నాళ్లూ.. ఓటీటీకి పరిమితం అయిపోవాలేమో.. అనుకున్న చిన్న చిత్రాలకు సరికొత్త ఆశలు చిగురించాయి. ఎలాగూ వచ్చే సీజన్లో పెద్ద సినిమాలే రానున్నాయి. వాటి మధ్య తమకు చోటు దొరుకుతుందా, లేదా? అనే అనుమానాల నేపథ్యంలో.. వీలైనంత త్వరగా… థియేటర్లలోకి వచ్చేయాలని రెడీ అవుతున్నాయి. అందుకే ఇక నుంచి ప్రతీ వారం రెండు మూడు చిన్న సినిమాలు రాబోతున్నాయి. ఫిబ్రవరి 5న అయితే.. ఏకంగా 10 సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.
జాంబీరెడ్డి, జీ – జాంబీ, చేతిలో చేయ్యేసి చెప్పు బావా, రాధా కృష్ణ, నాతో ఆట, విఠల్ వాడీ, జర్నలిస్ట్, ప్రణవం, జై మరియమ్మ, బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది .. ఈవీ 5న విడుదల అవుతున్న సినిమాలు. వీటిలో జాంబీ రెడ్డిపై ఎక్కువ ఫోకస్ ఉంది. ఎక్కువ థియేటర్లలో విడుదల అవుతున్న సినిమా కూడా అదే. `అ`, `కల్కి` లాంటి చిత్రాల్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. జాంబీ జోనర్లో వస్తున్న తొలి తెలుగు సినిమా కావడంతో… మన ప్రేక్షకులకు ఈ సినిమా కొత్తగా ఉండొచ్చు. జీ – జాంబీ కూడా ఆ జోనర్లో సాగే సినిమానే.