జడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగిన తప్పులు.. లోపాలు పంచాయతీ ఎన్నికల్లో జరగకూడదన్న లక్ష్యంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఉన్నారు. అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగిన చోట్ల ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడి రిటర్నింగ్ అధికారులను బదిలీ చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. చిత్తూరు, కడప జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలు అసాధారణంగా ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో దాడులు, దౌర్జన్యాలు, పోలీసుల బెదిరింపులు ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి.. ఇతరులు పోటీలో ఉండకుండా చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖుక ఎస్ఈసీ రాసిన లేఖలోనూ వీటి గురించి ప్రస్తావించారు.
ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా.. ఆయా ప్రాంతాల్లో జరుగుతూండటంతో… అధికారుల్ని మార్చాలని ఎస్ఈసీ రమేష్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి సిఫార్సు చేశారు. ఏకగ్రీవాలు అయిన ప్రాంతాల్లో రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీవోలు వ్యవహరిస్తారు. అలాంటి వారినందర్నీ బదిలీ చేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో దాదాపుగా 30 మంది ఎంపీడీవోల బదిలీకి ఆదేశించారు. అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో విస్తృతంగా అరాచకాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే జరుగుతోందన్న ఆరోపణలు రావడంతో ఎస్ఈసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
అయితే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పాటించడం లేదు. అతి కష్టం మీద ఒకటి.. రెండు ఆదేశాలను అమలు చేస్తున్నప్పటికీ.. అత్యధికం ధిక్కరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆంశంపై హైకోర్టులో పిటిషన్ పడింది. హైకోర్టు స్టేటస్ రిపోర్టు ఇవ్వమని ఆదేశించింది.^ఈ క్రమంలో… ఆ ఎంపీడీవోలను బదిలీ చేస్తారో లేకపోతే… వాళ్లతోనే ఎన్నికలు కొనసాగిస్తారో వేచి చూడాల్సి ఉంది.