అఖిల్ డూ – ఆర్ – డై సెట్యువేషన్లో ఉన్నాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టక తప్పని పరిస్థితి. తన ఆశలన్నీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`పైనే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా.. సంక్రాంతికి వస్తుందనుకున్నారు. ఆ తరవాత మార్చి అని ఫిక్సయ్యారు. మే 21 అని చిత్రబృందం కూడా ప్రకటించింది. ఇప్పుడు ఇంకాస్త ఆలస్యం అవుతోంది.
ఈ చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయడానికి చిత్రబృందం సమాయాత్తం అవుతోందిప్పుడు. కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసింది. మేలో పెద్ద సినిమాలున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ చిత్రాలు మేలోనే వస్తున్నాయి. ఆ పోటీ మధ్య నలిగిపోవడం ఇష్టంలేక.. బ్యాచిలర్ వెనక్కి తగ్గాడు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న చిత్రమిది. మనసా.. మనసా.. అనే గీతానికి మంచి స్పందన వచ్చింది. మిగిలిన పాటలూ అదే రేంజ్ లో ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. గోపీ సుందర్ మంచి ఫామ్ లో ఉన్నాడిప్పుడు. మ్యూజికల్ గా ఈ సినిమా హిట్టయితే.. `బ్యాచిలర్` భారం కాస్త తగ్గుతుంది.