ఉద్యోగం చేసేది అమెజాన్ లాంటి అతి పెద్ద ఎమ్మెన్సీ కంపెనీలో. కానీ అతని ఆలోచనలు మాత్రం అడవిలో సైకోల్లా ఉంటాయి. సోషల్ మీడియా అనే ప్రపంచంలో దొరికే స్టఫ్‌తో … తన వికృత ఆలోచనలు అమలు చేయడం ప్రారంభించి.. చివరికి అడ్డంగా దొరికిపోయాడు. పరువు పోగొట్టుకున్నాడు. ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. మీడియాలోనూ సైకోగా ఫేమస్ అయిపోయాడు. అతని పేరు సుమంత్.
ఫేస్‌బుక్‌లు.. ట్విట్టర్లు అన్నీ ఓల్డ్ అయిపోయాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రాం మీద పడ్డారు ఫ్రాడ్స్టర్స్. వీరిలో ఒకడు సుమంత్. అమ్మాయిల పేరుతో అకౌంట్లు ప్రారంభించి.. అమ్మాయిలకే రిక్వెస్టులు పెట్టి.. చాట్ చేసిన వారిని ముగ్గులోకి దించుతాడు. మంచి మాటలు చెప్పి న్యూడ్ పిక్స్.. వీడియోలు అడిగి … బ్లాక్ మెయిల్ ప్రారంభిస్తాడు. అయితే ఎప్పుడో ఓ సారి దొరికిపోవడం ఖాయం. అలాగే.. ఓ ఇంజనీరింగ్ విధ్యార్థిని కి ఇన్ స్టాగ్రామ్ లో చాట్ చేస్తూ .. అమ్మాయి పేరుతో ఉన్న అకౌంట్ నుండి న్యూడ్ ఫొటోస్ షేర్ చేశాడు. ఆ తరువాత తన న్యూడ్ ఫోటోస్ పంపాను కాబట్టి..నీవు కూడా పంపు అని కోరాడు. అప్పటికే స్నేహం మత్తులో ఉన్న ఆ పిల్ల కూడా.. అంతే పంపింది. అంతే .. సుమంత్లోని రాక్షసుడు బయటకు వచ్చాడు. బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించాడు. ఆ యవతి ఏదయితే అదయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు సుమంత్‌ను సులువుగానే పట్టుకున్నారు. అతని సోషల్ మీడియా ట్రాక్ రికార్డు చూసి షాకయ్యారు. పదుల సంఖ్యలో అకౌంట్లు ఉన్నాయి. 30 మందిని బ్లాక్ మెయిల్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. సుమంత్ అమెజాన్ కంపెనీలో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పెద్ద మొత్తంలో జీతం కూడా వస్తుంది. జీవితానికి ఏ చీకూ చింతా లేదు. మరింత కష్టపడితే… ఉన్నత స్థానానికి వెళ్లగలడు. కానీ సోషల్ మీడియా మత్తులో పడి.. లైంగిక వేధింపులకు పాల్పడటం.. హీరోయిజంగా భావించే సైకోతనానికి అలవాటుపడ్డాడు. జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.
సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగించేటప్పుడు… ఎవరూ తెలియని వారి పోస్టులకు లైక్‌లు కొట్టడం కానీ షేర్లు చేయడం కానీ.. స్నేహం చేయడం కానీ చేయవద్దని పోలీసులు చెబుతున్నారు. యువత ఇలాంటి హితువులను పట్టించుకుంటే ఇలాంటి మోసాలు చాలా వరకు తగ్గుతాయి.