మొన్నటి వరకూ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత బడ్డాయి. దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం తరువాత థియేటర్ తలుపులు తెరచుకున్నాయి. ఇప్పుడు 100 శాతం ఆక్యుపెన్సీకీ అవకాశం వచ్చింది. చిత్రసీమకి పునః వైభవం వస్తుందని ఆశిస్తున్న ఇలాంటి శుభతరుణంలో.. మళ్లీ థియేటర్లు మూతపడేలా ఉన్నాయి.దానికి కారణం…నిర్మాతలు – ఎగ్జిబీటర్లకూ మధ్య నడుస్తున్న వివాదాలే.
కొన్ని విషయాలపై నిర్మాతలకూ, ఎగ్జిబీటర్లకు మధ్య గత కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. మల్టీప్లెక్స్‌కి ఇస్తున్నట్టు సింగిల్ స్క్రీన్ థియేటర్లకూ.. పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలన్నది వాళ్ల ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ ని నిర్మాతలు పట్టించుకోవడం లేదు. పైగా ఓటీటీలో సినిమాని విడుదల చేసే విషయంలోనూ థియేటర్ యజమానులకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. పెద్ద సినిమా అయితే విడుదలైన ఆరు వారాల వరకూ ఓటీటీలో ప్రదర్శించకూడదని పట్టుబడుతున్నారు. చిన్న సినిమాకి కనీసం 4 వారాల గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమధ్య ఓటీటీకి – వెండి తెరకూ గ్యాప్ బాగా తగ్గిపోయింది. సినిమా థియేటర్లో విడుదలైన 15 రోజులకే ఓటీటీలోనూ చూసేస్తున్నారు. ఇలాగైతే… థియేటర్ వ్యవస్థే సర్వనాశనం అయిపోతుందని వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. తమ డిమాండ్లని నెరవేర్చని పక్షంలో… థియేటర్లను మళ్లీ మూసేస్తామని ఎగ్జిబీటర్లు హెచ్చరిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా నిర్మాతలూ – ఎగ్జిబీటర్ల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఈ మీటింగులకు ప్రముఖ నిర్మాతలంతా హాజరవుతున్నారు. కానీ.. ఏ విషయం తేలడం లేదు. రాబోయే రోజుల్లో బోలెడన్ని కొత్త సినిమాలు విడుదలకు సమాయత్తం అవుతున్నాయి. ఈ వేసవిలో స్టార్ హీరోలంతా సందడి చేయబోతున్నారు. ఈలోపే… తమ డిమాండ్లని నెరవేర్చుకోవాలన్నది థియేటర్ యజమానుల ఆలోచన. నిర్మాతలు కూడా ఈ సమస్యకి ఓ పరిష్కార మార్గం చూడాలని భావిస్తున్నారు. పెద్ద సినిమాలు విడుదలయ్యే ముందు థియేటర్లు మూసేస్తే… మళ్లీ లేనిపోని తలనొప్పులు వస్తాయి. అందుకే… ఒకట్రెండు రోజుల్లో ఈ విషయాన్ని తేల్చేయాలని భావిస్తున్నారు.