ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని బెదిరించారని కేసు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు దాదాపుగా పదిహేను సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టయిన వెంటనే స్టేషన్ బెయిల్ రాకుండా.. పై కోర్టుకు వెళ్లేందుకు సమయం పట్టేలా సెక్షన్లు పెట్టారు. అక్కడా బెయిల్ ఆలస్యమయ్యేలా రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. మరి ఆయనపై పెట్టిన కేసులో ఆయనేం చేశారు..? . బెదిరించారంటూ మాట్లాడిన ఆడియో టేప్‌ను విస్తృతంగా సర్క్యూలేట్ చేశారు. అది విన్నవారు.. దాన్ని బెదిరింపులా అని ఆశ్చర్యపోయారు. దానికే అరెస్ట్ చేస్తారా అని కూడా అవాక్కయ్యారు.
ఇప్పుడు విశాఖ జిల్లా వైసీపీ నేత, యలమంచిలి ఎమ్మెల్యే కూడా ఇలా బెదిరిస్తున్న ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన నేరుగా సంగతి చూస్తానన్నారు. ఇళ్లు కూలగొడతానన్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నేరుగా వెళ్లి ఆడియో రికార్డులతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రెండు రోజుల తర్వాత పోలీసులు కదిలారు. మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో.. ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేశారు. ఆ పెట్టిన కేసులు.. ఐపీసీ 506, 171(F)తో పాటుగా పంచాయతీరాజ్ చట్టం కింద కేసు పెట్టారు. అంటే… బెయిలబుల్ కేసులన్నమాట. కనీసం పోలీసులు నోటీసులు కూడా జారీ చేయరు.
అంటే అచ్చెన్నాయుడు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేసినా బెదిరించారని చెప్పి కేసులు పెట్టేసి.. అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేసేసిన పోలీసులు… యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఆ దూకుడు చూపించలేదు. నిజంగా బెదిరించి… అంతు చూస్తానని హెచ్చరించిన ఎమ్మెల్యేపై సాధారణ కేసులు అదీ కూడా మీడియాలో హైలెట్ అయితేనే నమోదు చేశారు. ఏపీలో చట్టం… ప్రతిపక్ష నేతలకు ఓకలా.. అధికార పక్షం నేతలకు మరోలా పని చేస్తోందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని..విపక్ష నేతలు అంటున్నారు. పోలీసులు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని కొంత కాలంగా విపక్షాలు చేస్తున్న విమర్శలు ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో మరింత బలంగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది.