ఆంధ్రప్రదేశ్లో హిందూత్వంపై దాడి జరుగుతోందన్న అభిప్రాయంపై అనేక మంది స్వామిజీలు ఉన్నారు. నాలుగు రోజుల కిందట తిరుపతి సమీపంలో .. తమిళనాడు పరిధిలోకి వచ్చే పొన్పాడి అనే గ్రామంలో పీఠాధిపతులందరూ సమావేశమయ్యారు. పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని.. వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని పోరాటం చేయాలని నిర్ణయించారు. త్వరలో తిరుపతిలో భారీ సభ నిర్వహిస్తామని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామి ప్రకటించారు. అయితే స్వామిజీలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్లాన్ చేస్తున్నారని ఇంటలిజెన్స్ సమాచారం రావడంతో ప్రభుత్వం ముందగానే అలర్ట్ అయింది.
కొంత మంది పీఠాధిపతులతో ప్రభుత్వం సన్నిహితంగా ఉంటోంది. వారికి కావాల్సిన పనులు చేస్తోంది. కావాల్సింత గౌరవం ఇస్తోంది. దాంతో వారు ఏపీలో ఏం జరిగినా.. హిందూత్వంపై దాడి జరిగినా స్పందించడం లేదు. కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగని.. హిందూత్వం మీద మాత్రమే నమ్మకం ఉంటే పీఠాలు మాత్రం ప్రభుత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నాయి. వారంతా ఏపీలో హిందూత్వ పరిరక్షణకు నడుంకట్టబోతున్నారన్న సమాచారం బయటకు వచ్చింది. అలాంటి పరిస్థితే వస్తే.. తమపై పడిన క్రిస్టియన్ ముద్ర మరింత విస్తృతం అవుతుందని.. హిందూ ఓట్లన్నీ వ్యతిరేకం అవుతాయని ఆందోళన చెందారు. విరుగుడుగా.. మంత్రి వెల్లంపల్లితో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణును రంగంలోకి దించారు. అన్ని పీఠాలకు వెళ్లి.. స్వామిజీల దర్శనం చేసుకుని..కానుకలు సమర్పించుకుని.. పరిస్థితుల గురించి వివరించి చెప్పి రావాలని పంపారు. వారు కూడా..మూడు రోజుల పాటు అన్ని పీఠాలకు దిగారు. నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పీఠాలకు వెళ్లారు. ఈ ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏపీలో అంతా బాగానే వుందని, చెదురు మదురు ఘటనలు మాత్రమే జరుగుతున్నాయని.. కొన్ని మీడియా సంస్థల హడావుడి మాత్రమేనని పీఠాధిపతులకు గౌరవంగా చెప్పి వచ్చారు. తమకు అనుకూలంగా ఉండే ఒకరిద్దరు స్వాముల ద్వారా అన్ని పీఠాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుని తమపైహిందూ వ్యతిరేక ముద్ర మరింత బలంగా పడకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు.