పార్లమెంట్ చర్చల్లో పాల్గొనడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడూ ముందు ఉంటారు. అలాంటిది రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. తన పేరు పిలిచే సమయానికి ఆయన వెళ్లిపోయారు. సాగు చట్టాల విషయంలో లోక్సభ పెద్దగా జరగడం లేదు. అప్పుడప్పుడూ కొంత మంది మాట్లాడుతున్నారు కానీ… అందులో వైసీపీ ఎంపీలెవరూ ఉండటం లేదు. సాగు చట్టాలపై మారధాన్ చర్చ జరపాలని రాజ్యసభ చైర్మన్ నిర్ణయించారు. అందులో వైసీపీ పాల్గొనడం కూడా కష్టమే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే.. విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్ని లైట్ తీసుకుని విశాఖలోనే మకాం వేశారు.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. ఆయన చెప్పినట్లుగానే మిగతా ఎంపీలు నడుచుకోవాలి. ఆయన ఇప్పుడు విశాఖలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు ముగియగానే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలు పెట్టేస్తారని ఆయన గట్టి నిర్ణయానికి వచ్చారు. నిమ్మగడ్డ పదవీ విరమణ చేయగానే ఎన్నికలు వస్తాయని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడే వచ్చేస్తున్నాయి కాబట్టి… పార్టీ నేతల్ని ప్రిపేర్ చేయడానికి విశాఖలో మకాం వేశారు. ఎలాంటి నివేదికలొచ్చాయో కానీ.. పార్లమెంట్ సమావేశాలు వదిలి విశాఖలో మకాం వేశారు. మేయర్ పీఠం గెలుచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.
పార్లమెంట్ సమావేశాల కన్నా.., విశాఖలో పార్టీ నేతలతో భేటీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్లమెంట్లో మాట్లాడాల్సి వస్తే.. కేంద్రానికి అనుకూలంగా మాట్లాడాల్సి వస్తుంది. కానీ పార్లమెంట్ బయట మాత్రం.. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బడ్జెట్ ను ఖండించారు. లోపల మాట్లాడితే అధికారికంగా రికార్డు అవుతుంది. అలా చేస్తే ఇంకా సమస్యలు వస్తాయి. అందుకే… విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా విశాఖలో రాజకీయం చేసుకోవడానికి సమయం కేటాయించేస్తున్నారు.