బీసీలను ముఖ్యమంత్రి చేసే దమ్ము ధైర్యం కేవలం బిజెపి కి మాత్రమే ఉందని, చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ తమ పార్టీ తరపున బీసీ ని ముఖ్యమంత్రి చేయగలరా అని నిన్న ఆవేశంగా ప్రశ్నించిన సోము వీర్రాజు ఈ రోజు తన నిన్నటి ప్రకటనపై యూ టర్న్ తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
సోము వీర్రాజు నిన్న మాట్లాడుతూ చంద్రబాబు జగన్ లు బీసీలను వాడుకుంటున్నారు కానీ బీసీలకు చేసిందేమీ లేదని అంటూ, చంద్రబాబు కానీ జగన్ కానీ ఒక బీసీ ని ముఖ్యమంత్రి చేయగలరా అంటూ సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీ ని సీఎం చేయగల దమ్ము కలిగిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే వీర్రాజు వ్యాఖ్యలు అటు బిజెపి ఇటు జనసేన కేడర్లో అయోమయం సృష్టించాయి. టిడిపి ఒక సామాజిక వర్గానికి వైఎస్ఆర్సిపి మరొక సామాజిక వర్గానికి పట్టం కడుతుండగా, సంఖ్యా బలం కలిగి ఉండి కూడా ఆంధ్ర రాజకీయాల్లో కాపులు వెనుకబడి ఉన్నారని, కాపు అభ్యర్థిని ముఖ్యమంత్రి చేసే అవకాశం బీజేపీతోనే సాధ్యం అని నమ్ముతూ ఉన్న ఈ రెండు పార్టీల అభిమానులలో సోము వీర్రాజు వ్యాఖ్యలు గందరగోళం సృష్టించాయి. మరి ఆ గందరగోళాన్ని గమనించారో లేక జాతీయ నాయకుల నుండి సూచన వచ్చిందో తెలియదు కానీ, సోము వీర్రాజు ఈ రోజు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిని పవన్ కలిసి నిర్ణయిస్తారు:
సోము వీర్రాజు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించే స్థాయి తనది కాదని, తమది జాతీయ పార్టీ అని చెప్పుకొచ్చారు. తమ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది బీజేపీ అధినేత జేపీ నడ్డా మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి చర్చించి నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తన నిన్నటి వ్యాఖ్యలు చంద్రబాబు జగన్లు బీసీలను రాజకీయ ఓటు బ్యాంకుగా ఎలా వాడుతున్నాయో అని చెప్పటానికి ఉద్దేశించినవే నని ఆయన వివరణ ఇచ్చారు.
ఇప్పటికైనా బిసి సీఎం వ్యాఖ్యల గందరగోళం ముగుస్తుందా అన్నది వేచి చూడాలి