ఓ హీరో – ఓ దర్శకుడి కాంబినేషన్లో వరుసగా రెండు సినిమాలొస్తే `హిట్ కాంబో` అనుకోవొచ్చు. అసలేమాత్రం గ్యాప్ లేకుండా… హ్యాట్రిక్ కొట్టేస్తే.. `ప్యాకేజీ` అనే అనుకోవాల్సివస్తుంది. రాజ్ తరుణ్ – విజయ్ కుమార్ కొండా గురించే ఈ మేటరంతా! ఇద్దరి కాంబినేషన్లో `ఒరేయ్ బుజ్జిగా` వచ్చింది. అదేం మెప్పించలేకపోయింది. అయితే అనూహ్యంగా.. వెంటనే ఇద్దరూ కలిసి `పవర్ ప్లే` మొదలెట్టేశారు. ఈ సినిమా పూర్తయిపోయింది కూడా. త్వరలోనే విడుదల అవుతోంది. ఇప్పుడు మూడో సినిమాకీ రంగం సిద్ధం చేసేసుకున్నట్టు సమాచారం.
సురేష్ బాబు చేతిలో `డ్రీమ్ గాళ్` అనే రీమేక్ సబ్జెక్ట్ రెడీగా వుంది. రాజ్ తరుణ్ తో ఆ సినిమా తీద్దామనుకున్నాడు. అయితే… దర్శకుడే దొరకడం లేదు. ఇప్పుడు విజయ్ కుమార్ కొండాతో లాగించేద్దాం అని ఫిక్సయినట్టు టాక్. `ఒరేయ్ బుజ్జిగా`, `పవర్ ప్లే` రెండూ తక్కువ టైమ్ లో, ప్యాక్డ్ బడ్జెట్ లో తీసి పెట్టాడు విజయ్. పైగా హీరోకీ, దర్శకుడికీ మంచి అండర్ స్టాండింగ్ కుదిరేసింది. అందుకే.. వరుసగా మూడో సినిమా కూడా చేసేద్దాం అనుకుంటున్నారు. సురేష్ బాబు కూడా.. విజయ్ కుమార్ కే ఈ రీమేక్ బాధ్యతలు అప్పగించాలని ఫిక్సయ్యాడని టాక్. ఇలా.. వరుసగా, ఏమాత్రం గ్యాప్ లేకుండా.. మూడు సినిమాలు చేసిన హీరో – దర్శక ద్వయం.. వీళ్లేనేమో? చూస్తుంటే నాలుగైదు సినిమాల ప్యాకేజీ ఒకేసారి కుదిరిపోయినట్టు లేదూ..?