నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఇప్పుడు టీఆర్ఎస్కు డూ ఆర్ డై ఫైట్లా మారిపోయింది. తమ ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి టీఆర్ఎస్కు ఇప్పుడు ఉన్న చాయిస్ అదొక్కటే. అందుకే నేరుగా రంగంలోకి కేసీఆర్ దిగారు. ఇప్పటికే తెర వెనుక పనులన్నీ పూర్తి చేస్తున్నారు. నోటిఫికేషన్ రాక ముందే ఒకటి రెండు సార్లు సాగర్‌లో పర్యటించనున్నారు. పదో తేదీన భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. దీనికి కేసీఆర్ హాజరవుతున్నారు. నాగార్జునసాగర్‌లో భారీ మెజార్టీతో గెలిచి టీఆర్ఎస్ బీజేపీ గెలుపులు గాలి బుడగతో సమానం అని తేల్చేలేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు.
ఇప్పటికే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి మేలు చేసే అనేక ప్రాజెక్టులు.. పథకాలను మంజూరు చేస్తూ జీవోలిచ్చారు. వాటి విషయంలో ప్రజల్లోసానుకూల చర్చ జరిగేలా ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే.. అంత కంటే మంచి పనులుచేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడంతో.. టీఆర్ఎస్ శ్రేణులు కూడా… ఉత్సాహంగా ఉన్నాయి.మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కాస్త ఆత్మరక్షణ ధోరణిలో ఉన్న టీఆర్ఎస్… చావో రేవో అన్నట్లుగా సాగర్‌లో పోటీ పడాలని భావిస్తోంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయలేదు. దుబ్బాకలోనూ చివరి రోజు బహిరంగసభ పెడతారని ప్రచారం జరిగింది కానీ.. ఆయన లైట్ తీసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో చివరికి ఓ సభ పెట్టారు కానీ ప్రయోజనం లేకపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ సారి నాగార్జునసాగర్‌లో ముందుగానే బహిరంగసభ నిర్వహించి.. ప్రజల్లో.. పార్టీ శ్రేణుల్లో కదలిక తేవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఉపఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఎదురు చూడకుండా ముందుగానే కసరత్తుచేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.